ఓటుకు నోటు తీసుకున్న ఓటర్లపైనా చర్యలు! | PIL for action against voters who takes bride | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు తీసుకున్న ఓటర్లపైనా చర్యలు!

Apr 21 2017 9:11 PM | Updated on Oct 8 2018 3:56 PM

ఓటుకు నోటు తీసుకున్న ఓటర్లపైనా చర్యలు! - Sakshi

ఓటుకు నోటు తీసుకున్న ఓటర్లపైనా చర్యలు!

ఓటర్లకు నోట్లు పంచినవారే కాదు తీసుకున్న వారిని సైతం నేరస్తులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ..

- ఇచ్చిన, తీసుకున్నవారిపై చర్యలకు వినతి
-ఆర్కేనగర్‌ ఉపఎన్నికలపై మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం
-వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్‌కు కోర్టు ఆదేశం


సాక్షి ప్రతినిధి, చెన్నై:
ఆర్కేనగర్‌ ఉపఎన్నికలకుగాను ఓటర్లకు నోట్లు పంచినవారే కాదు తీసుకున్న వారిని సైతం నేరస్తులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎన్‌ఆర్‌ఆర్‌ అరుణ్‌ నటరాజన్‌ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. ఆర్కేనగర్‌ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేశారని ప్రాథమికంగా రుజువుకావడంతో ఈనెల 12వ తేదీన జరగాల్సిన ఎన్నికల పోలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ 9వ తేదీన ప్రకటించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నళినీ చిదంబరం కోర్టుకు చెప్పారు.

అయితే నోట్లు పంచిన అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, నగదు పంపిణీకి నాయకత్వం వహించిన ఐదుగురు మంత్రులు ఇతర అనుచరులపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఆర్కేనగర్‌ పరిధిలోని పోలీసులను ప్రధాన ఎన్నికల కమిషన్‌ అదేశించలేదని తప్పుపట్టారు. నగదు పంపిణీకి బాధ్యులను, పుచ్చుకున్న ఓటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరాడు. ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది నిరంజన్‌ తనవాదనను వినిపిస్తూ, ఓటర్లకు నగదు పంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌ తరఫున చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపి ఆ పత్రాలను అందజేశారు.

ఆర్కేనగర్‌ పరిధిలోని రెండు లక్షల ఓటర్లను తనిఖీ చేయడం ఆచరణలో సాధ్యం కాదని, అలా చేస్తే ఓటు వేసేందుకు పోలింగ్‌ బూత్‌కు ఎలా వస్తారని నిరంజన్‌ వాదించారు. ఈ పిల్‌పై భారత ఎన్నికల కమిషన్, తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి, చెన్నై పోలీస్‌ కమిషనర్‌ సవివరమైన నివేదికను కోర్టుకు సమర్పించాలని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి ఎమ్‌ సుందర్‌ ఆదేశించారు. విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement