సీమాంధ్రుల భద్రతకు ‘ప్రజా రక్షణ కమిటీ’ | 'People defence committee to be formed for safety of seemandhra people' | Sakshi
Sakshi News home page

సీమాంధ్రుల భద్రతకు ‘ప్రజా రక్షణ కమిటీ’

Nov 7 2013 1:48 AM | Updated on Mar 18 2019 8:51 PM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పాలన సాధ్యం కాదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు జీవోఎంకు స్పష్టంచేశారు.

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పాలన సాధ్యం కాదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు జీవోఎంకు స్పష్టంచేశారు. దేశ రాజధాని, రాష్ట్రం కలిసే ఉన్నందున అక్కడ కేంద్ర పాలన సాధ్యమని, కానీ హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఈ దృష్ట్యా హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు ప్రజా రక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రిని దీనికి ఛైర్మన్‌గా నియమంచి, ఇరు ప్రాంత డీజీపీలను ఇందులో సభ్యులను చేయాలని విన్నవించారు.
 
  ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి చట్టపరంగా చర్యలు తీసుకొని, దోషులకు శిక్షపడేలా చేస్తుందని వెల్లడించారు. ఇక హైదరాబాద్‌ను  పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కాకుండా కేవలం ట్రాన్సిషన్ క్యాపిటల్‌గా మాత్రమే పరిగణించాలని జీవోఎంకు పంపిన నివేదికలో కోరారు. జీవోఎం సభ్యులను కలిసి నివేదికను అందించేందుకు మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జీవోఎం సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో నివేదికను అందరికీ ఈ మెయిల్ చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేను గురువారం ఉదయం కలిసి స్వయంగా అందించనున్నారు. మొత్తం 100 పేజీల నివేదికలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో క్షుణ్ణంగా వివరించారు. ఇదే సమయంలో రాజధాని, ఉద్యోగుల విభజన, నదీ జలాల పంపిణీ, ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన ఎలా జరగాలో సవివరంగా నివేదించారు.
 
 నివేదికలో పొందుపర్చిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి....
 ఠ జాతీయ హోదా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే గోదావరి నదిపై ఒక్క ప్రాజెక్టు కాకుండా 10 డ్యామ్‌లు నిర్మిస్తే ముంపు ప్రాంతం తగ్గడంతో పాటు నీటి నిల్వ, విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. దీన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. ఠ బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కృష్ణా జలాల మీద వాటా తేల్చాలి. ఠ తెలంగాణ రాష్ట్రంలోనూ ఆర్టికల్ 371(డి)ని కొనసాగించాలి. అయితే దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరంలేదని ఇదివరకే సుప్రీం తీర్పునిచ్చింది. ఠ ఉద్యోగుల సర్వీసు రిజిష్టర్‌లో పొందుపరిచిన స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన, పెన్షనర్ల విభజన చేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement