ఉల్లి చోరీ | onion theft in mumbai | Sakshi
Sakshi News home page

ఉల్లి చోరీ

Aug 24 2015 1:21 AM | Updated on Sep 3 2017 8:00 AM

ఉల్లి చోరీ

ఉల్లి చోరీ

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు కలియుగాంతం వచ్చేసిందా.. అంటే అవుననిపిస్తోంది. సొత్తు, డబ్బు దొంగతనం జరగడం సర్వసాధారణం. కానీ ఎన్నడూ కనీ.. వినీ ఎరగని రీతిలో ఉల్లి దొంగతనం జరిగింది

 ముంబైలో 700 కిలోల ఉల్లి దొంగతనం
 సాక్షి, ముంబై: శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు కలియుగాంతం వచ్చేసిందా.. అంటే అవుననిపిస్తోంది. సొత్తు, డబ్బు దొంగతనం జరగడం సర్వసాధారణం. కానీ ఎన్నడూ కనీ.. వినీ ఎరగని రీతిలో ఉల్లి దొంగతనం జరిగింది. ‘న భూతో’ అన్నది నిజమే కానీ ‘న భవిష్యతి’ అని అనలేని పరిస్థితి. ఎందుకంటే రోజురోజుకీ ధర పెరుగుతూ ఎవరెస్టంత పెకైక్కి కూర్చున్న ఉల్లి.. సామాన్య మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు ఇంకిపోయేలా చేస్తోంది మరి. కొద్ది రోజులుగా ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో దొంగల కన్ను వాటిపై పడింది. సైన్ ప్రతీక్షనగర్‌లోని ఓ షాపులో నిల్వ ఉంచిన 700 కేజీల బంగారాన్ని.. సారీ ఉల్లిని దొంగిలించారు మహానుభావులు. ముంబై వడాలాలోని ట్రక్ టర్మినస్ పోలీసు స్టేషన్‌కు ఆనంద్ నాయక్ అనే ఉల్లి వ్యాపారి పరుగెత్తుకుంటూ వచ్చాడు.

‘నా షాపులో దొంగలు పడ్డారు, దొంగలు పడ్డార’ంటూ కేకలు వేయసాగాడు. ఏవైనా బంగారు, వెండి వంటి విలువైన వస్తువులు దోచుకుపోయి ఉండొచ్చని తొలుత పోలీసులు అనుకున్నారు. తన షాపులో నిల్వ చేసిన 700 కిలోల ఉల్లి చోరీకి గురైందని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, షాపులో సీసీ టీవీ కెమెరాలున్నాయా, అని వ్యాపారిని ప్రశ్నించారు. ‘మాదేమైనా నగల దుకాణమా? సీసీ కెమెరాలు పెట్టడానికి’ అంటూ ఆనంద్ నాయక్ ఎదురు ప్రశ్నించాడు. షాపులో దొంగలు పడతారని కలలో కూడా ఊహించలేదని వాపోయాడు. శని వారం ఉదయం షాపు తెరిచి చూస్తే సరుకంతా మా యమైందని, 14 బస్తాల ఉల్లి దాదాపు 700 కిలోలు ఉంటుందని, విలువ రూ.50 వేల వరకు ఉంటుందని చెప్పుకొచ్చాడు. అతడి బాధంతా విన్న పోలీసులు చేసేది లేక.. ‘దొంగల కన్ను ఉల్లి షాపులపై పడింది. ఉల్లి వ్యాపారులూ.. అప్రమత్తంగా ఉండండి’ అని ఓ ఉచిత సలహా ఇచ్చి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement