మునికామ కోటి మృతి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం చేసిన మునికామ కోటి(41) ప్రాణాలు కోల్పోయాడు.
చెన్నై: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం చేసిన మునికామ కోటి(41) ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలోని కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశాడు.
ఈ ఉదయం అతడిని వేలూరిలోని సీఎంసీ ఆస్పత్రి నుంచి కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. మునికామ కోటి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ఏపీకి ప్రత్యే హోదా ఇవ్వాలంటూ శనివారం తిరుపతిలో మునికామ కోటి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. మొదట అతడిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేలూరు ఆస్పత్రికి తరలించారు. దాదాపు 95 శాతం శరీరం కాలిపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కోటి ఆరోగ్యం మెరుగుపడాలని కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ప్రత్యేక పూజలు ఫలించలేదు. కోటి బలిదానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
మొదటినుంచి ఉద్యమకారుడే..
తిరుపతిలో గతంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కోటి చురుకైన పాత్ర పోషించాడు. ఆందోళనలో తన నిరసన గళాన్ని తెలిపారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.ఆత్మహత్యాయత్నానికి ముందు ఇంట్లో ‘ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంద’ని చెప్పినట్లు కోటి కుటుంబీకులు తెలిపారు.


