కార్ల కంపెనీలకు ధన్తేరాస్ ధమాకా | Sakshi
Sakshi News home page

కార్ల కంపెనీలకు ధన్తేరాస్ ధమాకా

Published Sat, Oct 29 2016 1:40 PM

కార్ల కంపెనీలకు ధన్తేరాస్ ధమాకా

ఈ పండుగ సీజన్ కార్ల తయారీ కంపెనీలు ఫుల్ జోష్లో ఉన్నాయి. కొత్త కార్ల ఆవిష్కరణలతో వినియోగదారుల ముందుకు వస్తున్న కంపెనీలకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ధన్తేరాస్ సందర్భంగా దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ 30వేల వాహనాలను డెలివరీ చేసినట్టు ప్రకటించింది. ఈ విక్రయాలు గతేడాది కంటే 20 శాతం ఎక్కువ. బెలెనో, విటారా బ్రీజా మోడల్స్ ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని, మార్కెట్లో కంపెనీకి సహకరిస్తున్నాయని పేర్కొంది. అయితే కంపెనీ నిర్దేశించుకున్న టార్గెట్ 50 వేల యూనిట్ల కంటే తక్కువగానే విటారా బ్రీజాలు నమోదవుతున్నాయని, ఈ ఏడాది చివరికల్లా లక్ష్యాలను చేధిస్తామని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది.  
 
అదేవిధంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కూడా ధన్తేరాస్ సందర్భంగా మంచి విక్రయాలనే నమోదుచేసినట్టు తెలిపింది. 15,153 హ్యుందాయ్ కార్ల డెలివరీలను చేశామని పేర్కొంది. గతేడాది కంటే ఈ ఏడాది 26 శాతం వృద్ధి సాధించినట్టు హెచ్ఎమ్ఐఎల్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెలంతా మరో 50వేలకు పైగా యూనిట్లను డెలివరీ చేస్తామని అంచనావేస్తున్నట్టు పేర్కొన్నారు. గత రెండేళ్లలో ఈ ఏడాది పండుగ సీజనే కార్లకంపెనీలకు మంచి సీజన్గా నిలుస్తున్నట్టు సంతోషం వ్యక్తంచేశారు.  సకాలంలో రుతుపవనాల వల్ల మంచి వర్షాలు పడడం, ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు ఫలితంగా కార్ల విక్రయాలు పెరిగినట్లు కంపెనీలు భావిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement