కేంద్రం తెచ్చిన వివాదాస్పద భూసేకరణ బిల్లు పార్లమెంటు ముందుకు రావడం మరింత ఆలస్యం కానుంది...
శీతాకాల సమావేశాల వరకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన వివాదాస్పద భూసేకరణ బిల్లు పార్లమెంటు ముందుకు రావడం మరింత ఆలస్యం కానుంది. బిల్లును అధ్యయనం చేస్తున్న సంయుక్త పార్లమెంటు కమిటీ (జేపీసీ) దీనిపై నివేదిక సమర్పించేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి వారం వరకూ గడువు పొడిగించాలని నిర్ణయించింది. బిల్లులోని కొన్ని నిబంధనలపై అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాలంటూ సోమవారం జరిగిన భేటీలో జేపీసీలోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు జేపీసీ చైర్మన్ ఎస్.ఎస్. అహ్లూవాలియాను కోరగా అందుకు ఆయన అంగీకరించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...జేపీసీ నివేదిక జాప్యమయ్యేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందంటూ బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ వాకౌట్ చేయగా అహ్లూవాలియా బుజ్జగించి తిరిగి రప్పించారు. గత పొడిగింపు ప్రకారం జేపీసీ మంగళవారం పార్లమెంటుకు ఏకాభిప్రాయ నివేదిక సమర్పించాల్సి ఉంది. జేపీసీ తాజా నిర్ణయం నేపథ్యంలో కేంద్రం నాలుగోసారి భూసేకరణ ఆర్డినెన్సును జారీ చేయాల్సి రానుంది.