
ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం: ఈసీ
ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ మాయావతి, కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఈసీ తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్(ఈసీ) తోసిపుచ్చింది. ట్యాంపరింగ్ పై బీఎస్పీ, కేజ్రీవాల్ ఆరోపణలు నిరాధారమని.. ‘ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం’ అని స్పష్టం చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై రాజకీయ పార్టీల నుంచి గానీ, అభ్యర్థుల నుంచి గానీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించింది.
‘ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదు. సమర్థవంతమైన సాంకేతిక రక్షణ కల్పించాం. భారీగా పోలీసు భద్రత కల్పించాం’ అని ఈసీ పేర్కొంది. ఈవీఎంలను తొలిసారి ప్రవేశపెట్టిన సమయంలోనూ ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తాయని.. విషయం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లిందని పేర్కొంది. కాగా, ఎన్నికల కమిషన్ ఉపయోగించే ఈవీఎంలను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తాయి.