
ఉగ్రవాదిని దేశం దాటించాడు
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన జియా ఉర్ రెహమన్ అలియాస్ వఖాస్‌ను దేశ సరిహద్దులు దాటించిన...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన జియా ఉర్ రెహమన్ అలియాస్ వఖాస్‌ను దేశ సరిహద్దులు దాటించిన పాకిస్తానీ మహమ్మద్ నసీర్ నగర పోలీసులకు దొరికిపోయాడు. ముష్కరుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌ను జల్లెడపడుతున్న సిటీ పోలీసులకు నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జిహాదీ అల్ ఇస్లామి(హుజి)తో సంబంధమున్న పాకిస్తానీ మహమ్మద్ నసీర్‌తో పాటు ఫైజల్ మహమ్మద్ (బంగ్లాదేశ్), జోయ్‌నల్ అబెదిన్ (బంగ్లాదేశ్), జియా ఉర్ రెహ్మాన్ (మయన్మార్)ని అరెస్టు చేశారు.
అక్రమంగా వలస వచ్చి హైదరాబాద్‌లో నివాసముంటున్న వీరికి నివాస వసతి కల్పించడంతో పాటు విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టులు సమకూర్చి సాయం చేస్తున్న హైదరాబాద్ వాసులు మహమ్మద్ మసూద్ అలీ ఖాన్(చంచల్‌గూడ), సోహైల్ పర్వేజ్ ఖాన్ (బాలాపూర్,సైబరాబాద్)లను కూడా నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు భారత పాస్‌పోర్టులు, ఒక బంగ్లాదేశ్ పాస్‌పోర్టు, సిమ్ కార్డులున్న తొమ్మిది సెల్‌ఫోన్లు, జిహాదీ సాహిత్యం, ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్‌లు, పాస్‌పోర్టు డెలివరీ ఎన్వెలప్‌లు, అఫిడవిట్లు... ఇలా సుమారు వంద ఐడీ ప్రూఫ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
సిట్ ఏసీపీ డి.హరికుమార్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితులను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చేపట్టారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ టి.ప్రభాకర్‌రావు కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీర్ పుట్టింది బంగ్లాదేశ్ అయినా జీవనోపాధి కోసం పాకిస్తాన్‌కు వెళ్లి స్థిరపడ్డాడు. అంతకుముందే పాకిస్తాన్ వెళ్లి స్థిరపడిన బంధువైన అబ్దుల్ జబ్బర్‌కు మరింత సన్నిహితుడయ్యాడు నసీర్. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంటున్న జబ్బార్ హుజీకి సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్నాడు. నసీర్‌కు జిహాదీ సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్‌కు పంపించాడు.
దాడుల్లో దొరికారు...
రెండు నెలల క్రితం తెలంగాణకు వచ్చి మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఉంటున్న ఫైజల్ మహమ్మద్, జోయ్‌నల్ అబెడిన్, జియా ఉర్ రెహ్మాన్‌లను మసూద్ ఆలీ ఖాన్‌కు పరిచయం చేశాడు నసీర్. మసూద్ ఆలీఖాన్ ఇంట్లోనే షెల్టర్ కూడా ఇప్పించేలా ఏర్పాటు చేశాడు. ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులతో పాటు జాబ్ వీసాలపై ఇతర దేశాలకు వెళ్లి చట్టవ్యతిరేక కార్యకలపాలు నిర్వహించేందుకు భారత్ పాస్‌పోర్టులను కూడా సమకూర్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుమానం వచ్చి దాడులు చేయగా వీరంతా పట్టుబడ్డారు.
వఖాస్‌కు సహకరించిన నసీర్..
హుజి నేత అబ్దుల్ జబ్బర్ ఆదేశాల మేరకు దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో నిందితుడైన జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌ను పశ్చిమ బెంగాల్‌లో కలుసుకుని.. భారత సరిహద్దును దాటించి బంగ్లాదేశ్‌కు పంపించానని నసీర్ కేసు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మళ్లీ భారత్‌కు వచ్చిన వఖాస్... బిహార్ నుంచి రాజస్థాన్‌కు వచ్చాడు. ఈ సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ అధికారులు గతేడాది జనవరిలో అతన్ని రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో విచారణ కోసం చర్లపల్లి జైలులోనే ఉన్నాడు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎన్.కోఠి రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ మల్లేశ్, ఎస్‌ఐలు కె.వెంకటేశ్వర్లు, జాకీర్ హుస్సేన్, డి.వెంకటేశ్వర్లు తదితర సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. కాగా, ఈ కేసును విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.
ఐదేళ్ల క్రితమే భారత్‌కు...
నసీర్ 2010లో భారత్‌లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో మకాం మారుస్తూ వచ్చిన నసీర్... ఇప్పుడు హైదరాబాద్ బాలాపూర్‌లోని జల్‌పల్లిలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ పర్వేజ్ ఖాన్‌తో నసీర్‌కు స్నేహం ఏర్పడింది. చెంచల్‌గూడలో ఎంఎం జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్న తన బావ మసూద్ ఆలీ ఖాన్‌ను నసీర్‌కు పరిచయం చేశాడు. తన పరిచయస్తులను విదేశాలకు పంపించేందుకు పాస్‌పోర్టులను రూపొందించి ఇవ్వాలని మసూద్‌ను కోరాడు.అంగీకరించిన మసూద్... ఇప్పటివరకు దాదాపు 15 మందికి పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు వెళ్లేందుకు సహకరించాడు.