అమ్మా.. నాన్నా.. ఎందుకిలా?

అమ్మా.. నాన్నా.. ఎందుకిలా?


న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఘోర అమానుషం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు వదిలి వెళ్లడంతో గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతూ దాదాపు చావుకు దగ్గరైన ఇద్దరు చిన్నారులను పోలీసులు కాపాడారు. అమ్మ తమని ఎందుకు వదిలివెళ్లిందో అర్థంకాక, నాన్న తిరిగి వస్తాడో రాడో తెలియక ఆ పిల్లలు తికమకపడుతున్నారు.ఢిల్లీలోని సమయ్‌పుర్ బాద్లీ ప్రాంతానికి చెందిన రోజీ, బబ్లూ కుటుంబం ఓ చిన్న గదిలో కాపురం ఉండేది. వాళ్లకు ఇద్దరు కూతుళ్లు, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. ఏ ఉద్యోగం చేయని బబ్లూ రోజూ తాగి వచ్చి భార్యను, పిల్లల్ని వేధించేవాడు. దీంతో రెండు నెలల కిందట కొడుకుని తీసుకుని రోజీ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో అల్కా(8), జ్యోతి(3)లు తండ్రి ఉన్నా అనాథలయ్యారు. ఎప్పుడోగానీ ఇంటికొచ్చే బబ్లూ ఆగస్టు 15 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో గదిలో ఉండిపోయిన పిల్లలు తిండి, నీళ్లు లేక మలమూత్రాలను శుభ్రం చేయకపోవడంతో ఒళ్లంతా పుండ్లుపడిపోయి పిల్లలిద్దరూ దీనావస్థకు చేరుకున్నారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఆగస్టు 19న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. గది తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు.. దాదాపు చావు అంచులకు వెళ్లిన పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలిద్దరూ శుక్రవారం నాటికి కొద్దిగా కోలుకున్నారు.


తల్లి రోజీ జాడను కనిపెట్టిన పోలీసులకు ఆమె చెప్పిన సమాధానంతో షాక్ కు గురయ్యారు. 'నేనే దిక్కులేని బతుకీడుస్తున్నాను. ఇప్పుడా ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పెంచుకోను? వాళ్లు నాకు వద్దే వద్దు' అని రోజీ పోలీసులకు తేగేసి చెప్పింది. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ పిల్లల బాధ్యతను స్వీకరించేందుకు ముందుకొచ్చింది. డీసీడబ్ల్యూ చైర్మన్ స్వాతి మాలివాల్ మీడియాతో మాట్లాడుతూ పిల్లలిద్దరినీ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తామని తెలిపారు.


Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top