అసలు పేరు చెప్పి దొరికిపోయాడు!

అసలు పేరు చెప్పి దొరికిపోయాడు!


మాఫియా డాన్ ఛోటా రాజన్‌ ఎలా పట్టుబడ్డాడన్నది ఇప్పటివరకు సరిగ్గా వెలుగులోకి రాలేదు. నిజానికి బాలిలో విమానం దిగిన తర్వాత అక్కడి అధికారులకు తన పేరును పాస్‌పోర్టు మీద ఉన్న 'మోహన్ కుమార్' అని కాకుండా, తన అసలు పేరైన 'రాజేంద్ర నికల్జే' అని చెప్పాడట. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, ఇంటర్‌పోల్ వర్గాలు విచారించాయి. అతడి వేలిముద్రలు, ఇతర వివరాలు తమ వద్ద ఉన్న డేటాలో ఛోటా రాజన్ వివరాలతో సరిపోవడంతో భారతదేశంలో ఉన్న ఇంటర్‌పోల్ అధికారులకు బాలి ఇంటర్‌పోల్ అధికారులు ఈ విషయం చెప్పారు. రాజన్ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సీబీఐ బృందం వెంటనే బాలి వెళ్లి, రాజన్‌ను వెంట పెట్టుకుని తీసుకొచ్చింది.కోర్టులో సీబీఐ వర్గాలు అతడిని ప్రవేశపెట్టగా, కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి రాజన్‌ను పంపింది. ఢిల్లీలో దిగిన కాసేపటికే సీబీఐ వర్గాలు ఛోటా రాజన్‌ను అరెస్టు చేశాయి. నకిలీ పత్రాల ఆధారంగా పాస్‌పోర్టు తీసుకున్న నేరంలో ముందుగా అరెస్టు చేశారు. మోహన్ కుమార్ అనే పేరుతో రాజన్‌కు పాస్‌పోర్టు ఉంది. దీంతో పాస్‌పోర్టు చట్టం ప్రకారం మోసం, ఫోర్జరీ తదితర నేరాలకు గాను అతడిని అరెస్టు చేశారు. ముంబై పోలీసులు ఇంకా అధికారికంగా రాజన్ మీద ఉన్న కేసులను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేయాల్సి ఉంది కాబట్టి, అరెస్టు చేయడానికి తక్షణ కారణం వెతుక్కోవాల్సి వచ్చింది. శనివారం నుంచి ఈ ఐదు రోజుల్లో రాజన్‌ను సీబీఐ వర్గాలు ఇంటరాగేట్ చేస్తాయి. ఇప్పటివరకు ముంబై పోలీసులలో ఎవరెవరు దావూద్ ఇబ్రహీం కోసం పనిచేస్తున్నారో వాళ్ల పేర్లు వెల్లడించలేదు కాబట్టి దాని కోసమే ముందుగా దర్యాప్తు సాగొచ్చని తెలుస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top