ఇండియన్ ఐడల్ జూనియర్ విజేతగా అంజన | Bangalore girl Anjana Padmanabhan wins first 'Indian Idol Junior' | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఐడల్ జూనియర్ విజేతగా అంజన

Sep 2 2013 9:37 AM | Updated on Sep 1 2017 10:21 PM

ఇండియన్ ఐడల్ జూనియర్ విజేతగా అంజన

ఇండియన్ ఐడల్ జూనియర్ విజేతగా అంజన

సోనీ టీవీ నిర్వహించిన ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ రియాలిటీ పాటల కార్యక్రమం విజేతగా బెంగళూరుకు చెందిన అంజనా పద్మనాభన్ (10) నిలిచింది.

ఆ చిన్నారికి హిందీ రాదు. కానీ అద్భుతమైన గళంతో ఆమె పాడిన హిందీ పాటలకు ప్రేక్షకులతో పాటు జడ్జీలు కూడా మైమరచిపోయారు. అంతే.. పదేళ్ల అంజనా పద్మనాభన్ 'ఇండియన్ ఐడల్ జూనియర్' మొట్టమొదటి టైటిల్ను గెలిచేసుకుంది. ముంబైలో పలువురు దిగ్గజాల సమక్షంలో జరిగిన ఈ రియాల్టీ షో గ్రాండ్ ఫినాలేలో అంజన విజేతగా నిలిచింది. ఫైనల్స్లో ఆమెతో పాటు నిర్వేష్ సుధాంశుభాయ్ దవే, దేవాంజన కర్మాకర్, అన్మోల్ జస్వాల్ పోటీపడ్డారు. కానీ, వాళ్లందరినీ తోసిరాజని అంజన బహుమతి కొట్టేసింది.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన అంజన.. తాను ఇది ఏమాత్రం ఊహించలేదని, చాలా సంతోషంగా ఉందని వచ్చీరాని హిందీలో ముద్దుముద్దుగా చెప్పింది. ఈ బహుమతి కింద అంజనకు ట్రోఫీతో పాటు 25 లక్షల రూపాయల నగదు పురస్కారం, ఓ నిసాన్ మైక్రా కారు కూడా అందించారు. ఇంకా... కోటక్ మహీంద్రా, హార్లిక్స్ కంపెనీల నుంచి 5 లక్షలు, 2 లక్షల చొప్పున గిఫ్ట్ చెక్కులు అందాయి.

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, సంగీత దర్శకులు విశాల్ దద్లానీ-శేఖర్ రావ్జియానీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ స్వయంగా 'మేరే సాథ్ ఆవో మేరే దోస్తోం' అనే పాటను నలుగురు ఫైనలిస్టులతో కలిసి పాడారు. త్వరలో విడుదల కానున్న 'ఫటా పోస్టర్ నిక్లా హీరో' చిత్ర ప్రమోషన్ కోసం షాహిద్ కపూర్ కూడా వచ్చాడు.  జంజీర్ జంట రామ్ చరణ్, ప్రియాంకా చోప్రా కూడా వేదికపై డాన్సు చేశారు. శ్రేయా ఘోషల్ ఆషికీ2 లోని తన సూపర్ హిట్ సాంగ్ 'సున్ రహా హైనా తూ', బర్ఫీలోని 'ఇత్నీ సీ హసీ' పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement