
తెలుగు ఇండియన్ ఐడల్ షో నాలో కొత్త మార్పుని తీసుకొచ్చింది. నేను సంగీతం అందించిన సినిమాలు నన్ను ప్రేక్షకుల ఇంటిదాక తీసుకెళ్తే.. ఈ షో ఇంటిలోపలికి తీసుకెళ్లేలా చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ కు పనిచేయడం ఒక బాధ్యతగా, గౌరవంగా భావిస్తున్నాం’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా, శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ లో టాప్ 12 కంటెస్టెంట్స్ గాన ప్రతిభను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ - ఈ షో తర్వాత మేము మ్యూజిక్ కన్సర్ట్స్ కు వెళ్తే ఇండియన్ ఐడల్ లో బాగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మా కన్సర్ట్స్ కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తిరుపతి దర్శనానికి వెళితే.. ఓ పెద్దావిడ క్యూలో నుంచి అందరిని పక్కకి నెట్టి నా దగ్గరకు వచ్చి ‘ఇండియన్ ఐడల్‌లో బాగా చేస్తున్నావు’ అని చెప్పి వెళ్లిపోయింది.
ఇప్పటి వరకు నేను 176 సినిమాలకు సంగీతం అందించా.. వాటి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. షో గురించి చెప్పి వెళ్లింది(నవ్వుతూ..). అలాంటి గుర్తింపు మాకు తెలుగు ఇండియన్ ఐడల్ తీసుకొచ్చింది. ఈ షోలో డల్లాస్ నుంచి కూడా కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ షోను ఆర్గనైజ్ చేయబోతున్నాం. అందుకే గల్లీ టు గ్లోబల్ అనే క్యాప్షన్ పెట్టాం. కంటెస్టెంట్స్ పాడటం ఒక్కటే కాదు వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, ఇక్కడ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేవి అన్నీ క్యాప్చర్ చేస్తున్నాం. ఈ షోకు వస్తే మాకు హాలీడేకు వచ్చిన ఫీల్ కలుగుతుంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్ ను ఒక ఆస్తిలా భావిస్తున్నాం. అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అద్భుతంగా వచ్చింది. అంత బాగా మీరు చేస్తానంటేనే సీజన్ 4కు ఇన్వెస్ట్ మెంట్ పెడదాం అని అన్నాను. ఇండియన్ ఐడల్ వారికి ప్రతి సీజన్ కు డబ్బు ఇచ్చి రైట్స్ తీసుకోవాల్సిఉంటుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ 4 బాగా చేస్తున్నారు. ఇందుకు తమన్ కు థ్యాంక్స్ చెప్పాలి.
ఈ షోకు తమన్ లైఫ్ తీసుకొచ్చాడు. స్కూల్ లో చదువుతున్న పిల్లలు కూడా వచ్చి బాగా పాడుతున్నారు. ఇతర రాష్ట్రాల పిల్లలు తెలుగు నేర్చుకుని పాడుతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ క్రేజ్ ఎంతలా ఉందంటే అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ అక్కడి నుంచి కంటెస్ట్ చేసేందుకు వచ్చారు. మనం గల్లీ టు ఢిల్లీ అంటాం, కానీ ఇది గల్లీ టు గ్లోబల్ అయ్యింది. ఆహా నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ షో చేస్తున్నందుకు గర్వంగా ఉంది’అన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ సమీరా భరద్వాజ్, గీతా మాధురి పాల్గొని మాట్లాడారు.