కార్మికులను కుదేలుచేసిన మారుతీ ఘటన
మారుతీ మనేసర్ ప్లాంట్ లో 2012 జూలై 18న జరిగిన హింసాత్మక ఘటన కార్మికులను కుదేలు చేసింది.
మారుతీ మనేసర్ ప్లాంట్ లో 2012 జూలై 18న జరిగిన హింసాత్మక ఘటన కార్మికులను కుదేలు చేసింది. అరెస్ట్ లతో జైలుల్లో మగ్గి చివరికి నిర్దోషులుగా బయటికి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో కార్మికులకు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 2012లో మనేసర్ మారుతీ ప్లాంట్ లో కార్మికులకు, యాజమాన్యానికి జరిగిన ఆ వివాదం ఒక్కసారిగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్లాంట్ జనరల్ మేనేజర్ అవనీస్ కుమార్ మంటల్లో తీవ్రంగా గాయపడి చనిపోయారు. పలువురు ఎగ్జిక్యూటివ్ లు గాయపడ్డారు. దీంతో హింసాత్మక ఘటనలో పాలుపంచుకున్నారనే నెపంతో 148 మంది కార్మికులను అరెస్టు చేశారు. తాజాగా ఈ ఘటనపై గుర్గావ్ జిల్లా కోర్టు వెలువరించిన తీర్పులో 31 మంది దోషులుగా తేల్చి, 117 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ బయటికి విడుదల చేసింది. అయితే బయటికి వచ్చిన వీరికి ఎవరూ ఉద్యోగాలు ఇవ్వడం లేదు.హింసాత్మక ఘటనకు కొన్ని నెలల ముందు ప్లాంట్లో చేరిన కార్మికులు సైతం సంవత్సరాల తరబడి జైలులో మగ్గారు.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిప్లొమా చేసిన ఓ కార్మికుడు చేరిన 11 నెలలకే ఈ ఘటనతో 32 నెలలు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో తన ట్రైనింగంతా నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశాడు. కేవలం జైలులో ఉన్నామన్న కారణంలో ఉద్యోగాలకు తాము అనర్హులుగా మారామని చెప్పారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తమ స్వగ్రామానికి వెళ్లి కూలీగా బతుకుతున్నామని చెప్పారు. మిగతా కార్మికుల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా ఉంది. గూర్గావ్ లో ప్రతిఒక్కరూ దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించేలా మారుతీ పన్నాగం పన్నిందని, దీంతో ఇక్కడ ఎవరూ తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. మంచి ఉద్యోగం దొరకకపోతే, తమ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారి, కుటుంబంతో పాటు రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. దోషులుగా నిర్థారైన కార్మికుల పరిస్థితిపై కూడా వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.