ట్రాన్స్‌సెక్సువల్‌ హీరోయిన్‌.. ఇన్‌స్పైరింగ్‌ వీడియో


కాలికట్‌ :
భారతీయ సినీ పరిశ్రమలో మొట్టమొదటి ట్రాన్స్‌సెక్సువల్‌ హీరోయిన్‌గా ఇప్పటికే పాపురల్‌ అయ్యారు అంజలి అమీర్‌.  ఆమె జీవితగాథపై ‘101 ఇండియా’   సంస్థ తాజాగా ఓ షార్ట్‌ వీడియోను రూపొందించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.‘‘నేను పుట్టిన ఏడాదికే అమ్మ చనిపోయింది. ఊహ తెలిసే నాటికి ఒంటరినని తెలిసింది. కాలికట్‌(కేరళ)లో ఓ ముస్లిం కుటుంబంలో అబ్బాయిగా పుట్టిన నేను.. ఏనాడూ అలా ఉండలేకపోయా. మగవాడి శరీరంలో ఇరుక్కుపోయిన అమ్మాయినినేను. ఈ వైరుధ్యాన్ని మా ఇంట్లోవాళ్లు జీర్ణించుకోలేకపోయారు. బంధువులు, స్కూల్‌మేట్స్‌ అంతా నన్నొక విచిత్ర జీవిగా చూసేవాళ్లు. కానీ నేను మాత్రం వారి కళ్లలో దొరకని ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించేదాన్ని. కాలం భారంగా గడిచింది. 10వ తరగతి తర్వాత కొంత మార్పు. అప్పటిదాకా వేధించిన జెండర్‌ బాధను అధిగమించి, నన్ను నేనుగా ఇష్టపడటం నేర్చుకున్నా. ఆ నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. కొద్ది రోజులకే ఇంట్లోవాళ్లకు చెప్పకుండా బయటికి వచ్చేశా..కొయంబత్తూరు వెళ్లి ఎల్జీబీటీ కమ్యూనిటీతో కలిసిపోయా. కొంతకాలానికి బెంగళూరు షిఫ్ట్‌ అయ్యా. సెక్స్‌ మార్పిడి ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు కోసం బార్‌ డాన్సర్‌గా, ఇంకా రకరకాల పనులు చేశా.  చివరికి నా కల నెరవేరింది.  అప్పటి నుంచి వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. క్రమంగా మోడలింగ్‌లో అవకాశాలొచ్చాయి. పాపురల్‌ మోడల్‌గా ఎదుగుతున్న క్రమంలోనే సూపర్‌స్టార్‌ మమ్ముట్టి సార్‌ నుంచి పిలుపు.. ఆయన పక్కన హీరోయిన్‌గా చేయమని! అదొక అధ్బుతం. కానీ ఇలా జరుగుతుందని,  ఈ సమాజం నన్ను అంగీకరిస్తుందని ముందే తెలుసు. ఇప్పుడు నేనొక పరిపూర్ణ మహిళను’’  అని గర్వంగా చెబుతారు అంజలి.అంజలి ప్రస్తుతం.. సూపర్‌స్టార్‌ మమ్ముట్టి సరసన ‘పరంబు’ సినిమాలో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత రామ్‌ దర్శకత్వంలో మలయాళ, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘పరంబు’  ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top