రక్తదానం..నిలుపుతోంది ప్రాణం

World Thalassemia disease Day Special Story - Sakshi

నేడు వరల్డ్‌ తలసేమియా డే

చార్మినార్‌: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవాల్సిన అవసరముంది. అటు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు విరివిరిగా ముందుకొచ్చి సహాయ సహకారాలను అందజేయాలని తలసేమియా చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మేరకు రక్తాన్ని అందజేస్తున్నారు. తలసేమియా చిన్నారులను ఆదుకోవడానికి రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరముంది. పండుగలు, పర్వదినాలు, శుభకార్యాలప్పుడు తమ రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేయడానికి ముందుకొచ్చినప్పుడు తలసేమియా చిన్నారులను ఆదుకోవడానికి వీలు పడుతుంది. అంతేకాకుండా వేసవిలో స్వచ్చందంగా రక్తదానం చేయడానికి యువతీ యువకులు ముందుకు రావాల్సిన అవసరముంది. తలసేమియాతో బాధపడే చిన్నారులకు తలసేమియా అండ్‌ సికిల్‌ సెల్‌ సొసైటీ, బ్లడ్‌ బ్యాంక్‌ అవసరమైనప్పుడల్లా ఉచితంగా రక్తం అంది స్తోంది. రక్తం ఎక్కించుకోవడానికి (బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌) దిక్కు తోచని స్థితిలో ఉన్న బాధితులను సొసైటీ ఆదుకుని ఆపన్న హస్తం అందిస్తోంది.

రక్తంలో ఎర్రరక్త కణాలు క్షీణించడంతో...
రక్తంలో ఎర్రరక్త కణాలు క్షీణించడంతో తలసేమియా వ్యాధి సోకుతుంది. పుట్టినప్పటి నుంచే చిన్నారులకు ఈ వ్యాధి వస్తుండటంతో వ్యాధిగ్రస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. క్రమం తప్పకుండా బ్లడ్‌ ట్రాన్స్‌ప్యూజన్‌ (రక్తం ఎక్కించుకోవడం) జరిగితే తప్పా... చిన్నారులు బతకలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతోమంది పేద చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. వీరందరికి రక్తంతో పాటు ఆర్థిక అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మానవతా ధృక్పథంతో యువత ముందుకొచ్చి తలసేమియా చిన్నారులను ఆదుకోవాల్సిన అవసరముంది. 

పిల్లలకు ఈ వ్యాధి వారసత్వంగా ఎలా సంక్రమిస్తుందంటే..
తల్లిదండ్రుల్లో ఒకరు తలసేమియా క్యారియర్‌ కలిగి ఉంటే, 50 శాతం వారి పిల్లలు తలసేమియా క్యారియర్‌గా ఉంటారు. 50 శాతం ఏ వ్యాధి లేకుండా మాములుగా ఉంటారు.  
తల్లిదండ్రులిద్దరూ తలసేమియా క్యారియర్స్‌ అయితే పిల్లల్లో 25 శాతం సాధారణమైన వారు, 50 శాతం క్యారియర్స్, 25 శాతం తలసేమియా వ్యాధి గ్రస్తులుంటారు.  
తల్లిదండ్రుల్లో ఒకరు తలసేమియా వ్యాధి, ఇంకొకరు  క్యారియర్‌గా ఉంటే వారి పిల్లలు 50 శాతం   క్యారియర్, 50 శాతం తలసేమియా వ్యాధిగ్రస్తులవుతారు.  
తల్లిదండ్రులిద్దరూ తలసేమియా వ్యాధితో బాధపడుతుంటే.... వారి పిల్లలు 100 శాతం తలసేమియా వ్యాధిగ్రస్తులవుతారు. 

చిన్నారుల జీవితాలను కాపాడడానికి...
చిన్నారుల జీవితాలను కాపాడడానికి తలసేమియా అండ్‌ సికిల్‌ సెల్‌ సొసైటీ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్, బ్లడ్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేసింది. సొసైటీ సభ్యులు చిన్నారుల జీవిత కాలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం హైదరాబాద్‌ నగరంలోని చిన్నారులే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. మూడు వారాలకొకసారి రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నో ఇబ్బందులను తట్టుకుని చిన్నారుల తల్లిదండ్రులు శివరాంపల్లిలోని ఎన్‌పీఏ దగ్గరలోని కార్యాలయానికి చేరుకుంటున్నారు. సకాలంలో బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ జరగకపోతే...చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. తలసేమియాతో బాధపడే చిన్నారులను రక్షించడానికి సొసైటీ కృషి చేస్తోంది.  

తలసేమియా వ్యాధి నుంచిచిన్నారులను రక్షించడానికి..
పెళ్లికి ముందు వధువు, వరుడు హెచ్‌బీఏ2 పరీక్ష ద్వారా వ్యాధి రోగ నిర్ధారణ చేయించుకోవాలి.  
ఏదైనా కుటుంబంలో ఎవరైన తలసేమియా వ్యా«ధి కలిగి ఉన్నట్లయితే... ఆ కుటుంబంలోని సభ్యులందరూ హెచ్‌బీఏ2 రోగ నిర్ధారణ రక్త పరీక్ష చేయించుకోవాలి.  
తలసేమియా వ్యాధికి ఒక వ్యక్తి రోగ నిర్ధారణ అనుకూలంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.  
గర్భిణీలు హెచ్‌బీఏ2 పరీక్ష చేయించుకోవాలి.  
గర్భధారణ సమయంలో మద్యపానం, ధూమపానం చేయరాదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top