చాక్లెట్‌ సిటీ

World Chocolate Day Special Story - Sakshi

నగరం నోరు తీపి చేసుకుంటోంది. చాక్లెట్‌ రుచికి దాసోహమంటోంది. పుట్టిన రోజైనా,ప్రేమికుల దినమైనా, పరీక్షల్లో పాసైనా, ఆనందించే ఊసేదైనా... ‘చాక్లెట్‌ పార్టీ’ తప్పనిసరి అంటోంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న చాకొలెట్‌ క్రేజ్‌లో సిటీ గణనీయమైన వాటాపంచుకుంటోంది. ఈ అంశంపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలోనే టాప్‌ సిటీల్లో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. 

సాక్షి, సిటీబ్యూరో : ప్రపంచ చాక్లెట్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్లెట్‌ సంబంధ ఉత్పత్తులను కొనుగోలు చేయడంపై దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ఆధ్వర్యంలో ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో చాక్లెట్‌ల విక్రయాల్లో బెంగుళూర్‌ తొలి స్థానంలో ఉండగా.. హైదరాబాద్, ముంబై, చెన్నై తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.  

రూపాలెన్నో... రుచి ఒకటే..  
ఒకప్పుడు అంటే రాపర్లలో చుట్టిన చిన్న చిన్న చాక్లెట్లు, ఆ తర్వాత డైరీ మిల్క్‌ లాంటివి... అలా కొన్నే ఉండేవి. ఇప్పుడు విభిన్న మార్గాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. విభిన్న రకాల ఫ్లేవర్లు, ముడి దినుసులలో  సులువుగా కలిసిపోయే సుగుణం చాక్లెట్‌ను మరింతగా ప్రేమించేలా చేస్తోంది. ఐస్‌క్రీమ్స్, మిల్క్‌షేక్స్‌.. ఇలా ప్రతి దానిలో చాక్లెట్స్‌ ఒదిగిపోతున్నాయి. ఆఖరికి షో పీస్‌గా కూడా ఇవి అమరిపోతున్నాయి. పండ్ల దగ్గర్నుంచి లిక్కర్‌ దాకా ప్రతిదానికీ జత కడుతున్నాయి. సిరప్‌లతో సహా విభిన్న రూపాల్లో చాక్లెట్లు వినియోగించడం సిటీలో బాగా పెరిగింది. దీంతో చిన్నాపెద్దా తేడా లేకుండా చాకో క్రేజ్‌లో మునిగితేలుతున్నారు. సీ సాల్ట్, స్‌పైస్, మింట్, కార్డమామ్‌ వంటి విభిన్న రకాల వెరైటీలు అందుబాటులోకి వస్తుండడం క్రేజ్‌కి మరింత ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా చాక్లెట్స్‌ విక్రయాల కోసమే చాక్లెట్‌ హట్, చాకో హబ్‌ వంటి పేర్లతో రెస్టారెంట్స్‌ నగరంలో వెలుస్తున్నాయి.   

ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌లో ముంబై టాప్‌..  
చాక్లెట్స్‌ కోసం ఆర్డర్స్‌ అందిస్తున్న వారిలో 18–24 ఏళ్ల వారే ఎక్కువ. ఆన్‌లైన్‌లో చాక్లెట్స్‌ను ఆర్డర్‌ ఇస్తున్న వారిలో పురుషుల కన్నా 25శాతం మంది మహిళలు ఎక్కువ ఉన్నారు. ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌కు సంబంధించి ముంబై ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటే, బెంగళూర్, హైదరాబాద్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే విక్రయాల పరంగా బెంగళూరు ఫస్ట్‌ ప్లేస్‌ దక్కించుకోగా హైదరాబాద్, ముంబై తర్వాతి స్థానాల్లో ఉండడం విశేషం. సిటీలో యాప్‌ ద్వారా అందుకునే డిసర్ట్స్‌ (స్వీట్స్‌) ఆర్డర్లకు సంబంధించి 60శాతం వరకు చాక్లెట్‌ సంబంధ ఉత్పత్తులే. గత రెండేళ్లలో ఏడాదికి 13శాతం వరకు చాక్లెట్ల విక్రయాల్లో పెరుగుదల కనిపిస్తోంది. డెత్‌ బై చాక్లెట్, హాట్‌ చాక్లెట్‌ ఫడ్జ్, చాక్లెట్‌ మిల్క్‌షేక్, చాక్లెట్‌ బ్రౌనీ, చాక్లెట్‌ ట్రఫుల్‌ పేస్ట్రీ... వంటివి అత్యధికంగావిక్రయమవుతున్నాయి.

ఈట్‌.. చాక్లెట్‌  
ఏదైనా ఫుడ్‌ కాస్త హెవీగా తీసుకున్న తర్వాత చాకొలెట్‌ను ఎంజాయ్‌ చేయడం బాగా పెరిగింది. డిన్నర్, స్నాక్స్‌ పూర్తి చేసిన తర్వాత కూడా సిటీజనులు లెట్స్‌ చాక్లెట్‌ అంటున్నారు. విశేషమేమిటంటే... నగరంలో చాక్లెట్లను అర్ధరాత్రి సమయంలోనే ఎక్కువగా ఆర్డర్‌ ఇస్తున్నారట. అలాగే బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ తర్వాత కూడా వీటి వినియోగం బాగా ఉంటోంది. ముఖ్యంగా వారాంతాల్లో ఈ ట్రెండ్‌ మరింతగా కనిపిస్తోంది. చాక్లెట్‌ మోమో, చాక్లెట్‌ పిజ్జా, శాండ్‌విచ్, చాక్లెట్‌ గ్రిల్డ్‌ శాండ్‌విచ్, చాక్లెట్‌ టోస్ట్‌ వంటివి ఆన్‌లైన్‌ ద్వారా బాగా ఆర్డర్లు అందుకుంటున్న వాటిలో ఉన్నాయి. చాక్లెట్‌ కుకీ, చాక్లెట్‌ పేస్ట్రీస్‌ ఉదయం ఆర్డర్లలో బాగా ఉంటున్నాయి.  

అభి‘రుచి’...  
ప్రతి సంతోషకర సందర్భంలో చాక్లెట్‌ భాగమవుతోంది. వలంటైన్‌ డే రోజున విక్రయాలు మరింత పెరుగుతున్నాయి. సగటున రోజువారీ విక్రయాలతో పోలిస్తే... ఆ రోజున 50శాతం అధికంగా ఉంటున్నాయి. అలాగే మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే రోజున కూడా విక్రయాల్లో భారీ తేడా నమోదవుతోంది. ఇది ఇష్టం కన్నా ఒక బలహీనతలా మారింది. న్యూటెల్లా లేదా బ్యాకాన్‌... ఏదైనా సరే చాక్లెట్‌తో కలిపి తీసుకుంటే ఆ టేస్టే వేరు
– విధి, ఫుడీ

వర్కవుట్‌కి ముందు...
సరైన సమయంలో సరైన పరిమాణంలో చాక్లెట్‌ను తీసుకుంటే అది చాలా ఉపకరిస్తుంది. వెయిట్‌లాస్‌కి కూడా పనికొస్తుంది. ప్రీ వర్కవుట్‌ స్నాక్‌గా నేను చాక్లెట్‌ను తీసుకుంటాను. ఇది నాకు మంచి శక్తిని, చర్మానికి మెరుపును అందిస్తుంది.– స్వీటీ, మోడల్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top