మహిళా ఐఏఎస్‌లకు కేసీఆర్‌ పెద్దపీట

Women Collectors Lead Telangana Districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గత ప్రభుత్వ మంత్రివర్గంలో కనీసం ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణకు తొలి మహిళా గవర్నర్‌ బాధ్యతలు చేపట్టడంతో పాటు ఇద్దరు మహిళా మంత్రులకు కూడా ఈసారి కేసీఆర్‌ అవకాశం కల్పించారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో మహిళా అధికారులకూ ముఖ్య బాధ్యతలను అప్పగిస్తున్నారు. పరిపాలన ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలో భారీ ఎత్తున ఒకేసారి 50 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా అధికారులకు పెద్దపీఠ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 21 జిల్లాలకు కొత్త పాలానాధికారులను నియమించగా.. వాటిల్లో 8 జిల్లాలకు మహిళా అధికారులను కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించడం విశేషం. (50 మంది ఐఏఎస్‌ల  బదిలీ)

పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో మహిళా కలెక్టర్లను నియమించడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌ లాంటి మెట్రోపాలిటన్‌ నగరానికి యువ ఐఏఎస్‌ అధికారిని శ్వేతా మహంతికి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. మరో యువ అధికారిని సిక్తా పట్నాయక్‌ను నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి కలెక్టర్‌గా నియమించారు. కేవలం కలెక్టర్లనే కాకుండా ప్రభుత్వ ముఖ్య శాఖల్లో కూడా మహిళా అధికారులకే సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యత కల్పించారు. యువ అధికారులు కావడం.. గతంలో ముఖ్యశాఖలకు విధులు నిర్వర్తించిన అనుభవం ఉండటంతో పాలనాపరంగా కలిసోస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇటీవల ముగిసిన పల్లెప్రగతి తొలి విడత కార్యక్రమంలో సాధించిన ఫలితాలు, త్వరలో అమల్లోకి తేనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిగణనలోకి తీసుకుని సర్కారు జిల్లా కల్లెక్టర్ల బదిలీలు జరిపినట్లు తెలుస్తోంది.

నారాయణ పేట జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టిన హరిచందన


జనగామ జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టిన కె.నిఖిల 

కొత్తగా బాధ్యతలు చేపట్టిన మహిళా అధికారులు

1. పాసమి బసు, కలెక్టర్ (వికారాబాద్‌)
2. దేవసేన (ఆదిలాబాద్‌)
3. హరిచందన (నారాయణ్‌పేట)
4. శ్వేతా మహంతి (హైదరాబాద్‌)
5. శృతి ఓఝూ (జోగులాంబ గద్వాల)
6. సిక్తా పట్నయక్ (పెద్దపల్లి)
7. కె. నిఖిల (జనగామ)
8. షేక్‌ యాస్మిన్‌ బాషా (వనపర్తి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top