
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఆర్మూర్‌రూరల్ సీఐ
వేల్పూర్: మండలంలోని లక్కోర లో శుక్రవారం మధ్యాహ్నం గోత్రల లక్ష్మి(45) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. లక్కో ర రామాలయం నుంచి గోవింద్‌పేట్ వెళ్లేదారిలో వ్యవసాయ క్షేత్రంలో ఆమెను కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి చంపారు. గ్రామస్తులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి. ఇందల్వాయికి చెందిన గోత్రల లక్ష్మి, ఆమె భర్త యాదగిరి సుమారు 15 ఏళ్ల కింద లక్కోరకు వలస వచ్చారు. భర్త కూలి పని చేసేవాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు మహేశ్ ఉన్నారు. కూతుళ్లకు పెళ్లి చేశారు. భర్త, కొడుకు సుమారు నాలుగేళ్ల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నాడు. అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ, కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న తరుణంలో హత్యకు గురికావడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే ఆమె ఊహించని రీతిలో చనిపోవడం గ్రామంలో కలకలం రేపింది. విషయం తెలియగానే ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీరాం విజయ్‌కుమార్, వేల్పూర్ ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. హత్యకు గల కారణాలను డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి విశ్లేషించారు.
తేలు శంకర్‌పై అనుమానం..
గోత్రల లక్ష్మి లక్కోరకు చెందిన తేలు శంకర్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో హత్యకు గురికావడంతో, అతడు అతడి భార్య కలిసి చంపినట్లు అనుమానిస్తున్నామని సీఐ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. వారి మధ్య ఏదైనా వివాదం జరిగి హత్యకు దారి తీసిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.