వానల్లేక.. వెలవెల | water problems to farmers in kharif season | Sakshi
Sakshi News home page

వానల్లేక.. వెలవెల

Aug 25 2014 1:17 AM | Updated on Aug 1 2018 3:59 PM

ఎగువన మహారాష్ట్రలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఆశించిన వర్షపాతం లేక ఎస్సారెస్పీ వెలవెలబోతోంది.

వర్షాభావం కలవరపెడుతోంది. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం పడిపోతోంది. భూగర్భ జలం అడుగంటుతోంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే జూన్ నుంచి ఇప్పటివరకు 53 శాతం తక్కువ వర్షం కురవడంతో.. జిల్లా అంతటా కరువు దుర్భిక్షం కనిపిస్తోంది. ప్రధానంగా జిల్లాకు సాగునీటి వర ప్రదాయనిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి మట్టం లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. నిరుడు ఇదే సమయానికి ఎస్సారెస్పీ నుంచి సాగునీటిని విడుదల చేయటంతోపాటు వరద కాల్వకు నీటిని వదలగా... ఈ ఏడాది వానాకాలం మొదలై రెండు నెలలు దాటినా చుక్కనీరు చేరక ఎస్సారెస్పీ వెలవెలబోతోంది.
 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఎగువన మహారాష్ట్రలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఆశించిన వర్షపాతం లేక ఎస్సారెస్పీ వెలవెలబోతోంది. గత ఏడాది ఆగస్టు 24న ఎస్సారెస్పీలో 1090.70 అడుగుల నీటి మట్టం ఉండగా.. జలాశయంలో 88.662 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆదివారం ఉదయం కేవలం 1066.40 అడుగుల నీటి మట్టంతో జలాశయంలో 22.736 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిరుటితో పోలిస్తే నీటి నిల్వలు నా లుగోవంతుకు పడిపోవటం వర్షాభావం తీవ్రతకు అద్దం పడుతోంది.  ఎ గువన వర్షాలు లేక చుక్క ఇన్‌ఫ్లో చేరకపోవడంతో జలాశయంలో ఉన్న నిల్వ నీరు ఖాళీ అవుతోంది. వర్షాకాలం ప్రారంభంలో రిజర్వాయర్‌లో 24 టీఎంసీల నీరు నిల్వ ఉంటే.. రెండు నెలల్లో 1.27 టీఎంసీల నీరు అడుగంటింది.
 
మరో రెండు నెలల పాటు బాబ్లీ గేట్లు తెరిచి ఉంటాయి. ఈ వ్య వధిలోనూ ఇన్‌ఫ్లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది సృమద్ధిగా వర్షాలు కురవడంతో జూన్ నుంచే ఇన్‌ఫ్లో మొదలైంది. జలాశయం నిండిపోవటంతో జూలై 26న తొమ్మిది గేట్లు ఎత్తి వరద నీటిని వదిలేశారు. జూలై 19 నుంచే కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కులు, వరద కాల్వకు 19 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఎస్సారెస్పీలో అంతర్భాగమైన దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండీ) పూర్తిగా నీటితో నిండింది. నిరుడు ఆగస్టు 24న ఎల్‌ఎండీలో 920 అడుగుల నీటి మట్టం ఉంది. 24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆదివారం నాటి లెక్కల ప్రకారం కేవలం 897.45 అడుగుల నీటి మట్టం, 9.047 టీఎం సీలు మాత్రమే నీరు నిల్వ ఉంది.
 
దీంతో తాగునీటి అవసరాలకు మినహా సాగుకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఖరీఫ్‌లో ఈ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. బోర్లు, బావులపై ఆధారపడి కొందరు పంటలు సాగు చేసినా.. భూగర్భ జలమట్టం పడిపోతున్న తీరు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిరుడు ఇదే సమయానికి జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 6.45 మీటర్లుగా నమోదైంది. జూలై నెలలో ఈ జలమట్టం 8.88 మీటర్లుగా రికార్డు అయింది. అంటే నిరుటితో పోలిస్తే 2.43 మీటర్ల మేరకు భూగర్భజలం తగ్గిపోయింది. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆగస్టు నెలాఖరు వరకు భూగర్భ జలమట్టం మూడు మీటర్లకు పడిపోతుందని భూగర్భ జలశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement