కొత్త ఓటర్లు 24,000

Warangal Voters Final List Is Ready - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: జిల్లా యంత్రాంగం శనివారం నూతన ఓటరు జాబితాను  విడుదల చేసింది. ఇటీవల కొత్త ఓటర్ల నమోదుతోపాటు, ఓటర్ల సవరణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం తెలంగాణలో ఓటర్ల జాబితాను ఈ నెల 8న ప్రకటించాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా సరిగా లేదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఓటర్ల జాబితాను ప్రకటించొద్దని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని అదేశించింది. ఈ నేపథ్యంలో మార్పులు,  చేర్పులకు మరో నాలుగు రోజుల గడువు పొడగిస్తూ తుది జాబితాను శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేశారు.

సాధారణంగా ఒక రోజు ముందే తుది జాబితాను ప్రకటిస్తుంటారు. అయితే సాఫ్ట్‌వేర్‌ చిక్కులతో జాబితా విడుదల ఆలస్యమైనట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 5,36,756 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో పరకాల, నర్సంపేట నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎన్నికల అధికారి పరిధిలోకి,  పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం జనగామ జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో, భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని శాయంపేట మండలం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో ఉన్నాయి.

జిల్లాలో 5,36,756  మంది ఓటర్లు
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని మొత్తం 5,36,756 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి జాబితా విడుదల చేశారు. జిల్లాలో పురుష ఓటర్లు 2,66,659, మహిళా ఓటర్లు 2,70,074, ఇతరులు 21 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా పురుషుల కంటే మహిళ ఓటర్లు 3,415 మంది అధికంగా ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 2,04,450 , పరకాల నియోజకవర్గం పరిధిలో 1,94,983 మంది ఓటర్లు ఉన్నారు. పరకాల నియోజకవర్గం కంటే నర్సంపేట నియోజకవర్గంలో ఓటర్లు 9,467 అధికంగా ఉన్నారు.

కొత్త ఓటర్లు 24,546 
ఇటీవల నిర్వహించిన నూతన ఓటర్ల స్పెషల్‌ డ్రైవ్‌లో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 40,629 మంది నూతన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా, వీటిని బూత్‌ లెవల్‌ అధికారులు పరిశీలించారు. అనంతరం 24,546 మందిని అర్హులుగా గుర్తించారు.

నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా 12,415 మంది ఓటర్లు నమోదు కాగా, వారిలో  పురుషులు 5,633, మహిళలు 6,781 మంది, థర్డ్‌ జండర్‌ ఒకరు , పరకాల నియోజకవర్గం పరిధిలో 12,131 మంది కొత్తగా ఓటరుగా నమోదుకాగా 5,537 మంది పురుషులు, 6,593 మంది మహిళలు, థర్డ్‌ జండర్‌ ఒకరు పెరిగారు.

2014 కంటే స్వల్పంగా పెరిగిన ఓటర్లు 
2014లో పరకాల, నర్సంపేట రెండు నియోజకవర్గాల ఓటర్లు 3,99,055 ఉండగా శనివారం ప్రకటించిన ఓటర్లు 3,99,433 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల కంటే 2018లో జరిగే ఎన్నికలకు 378 మంది ఓటర్లే పెరిగారు. 2014లో నర్సంపేట పరిధిలో 2,05,605, పరకాల 1,93,450 మంది ఓటర్లు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top