ఆడంబరాలపై ఆంక్షలు

Waqf Board Action Plan on Muslim Weddings - Sakshi

ముస్లిం పెళ్లిళ్లపై వక్ఫ్‌ బోర్డు యాక్షన్‌ ప్లాన్‌

అర్ధరాత్రి బరాత్‌లు, హంగామాకు చెక్‌

సాక్షి, హైదరాబాద్‌: ముస్లింల పెళ్లంటే ఆడంబరాలతో అర్ధరాత్రి దాటాల్సిందే. హంగూ ఆర్భాటాల బరాత్‌తో పెళ్లికొడుకు ఫంక్షన్‌ హాల్‌కు చేరాలంటే రాత్రి 11.30 గంటలు కావాల్సిందే. తర్వాత నిఖా(పెళ్లి) ప్రక్రియ ముగిసేసరికి అర్ధరాత్రి 12 గంటలు దాటాల్సిందే. ఇక విందు భోజనాల్లో పలు రకాల బిర్యానీలు, చికెన్, స్వీట్‌ డిష్‌లు ఉండాల్సిందే. ఇదీ హైదరాబాద్‌లో తాజా పరిస్థితి. దీనిని కట్టడి చేసేందుకు తెలంగాణ వక్ఫ్‌బోర్డు పాలకమండలి ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. ఇటీవల అర్ధరాత్రి వివాహ వేడుకలు, ఆర్కెస్ట్రాలతో పెద్ద ధ్వనులు, ’బరాత్‌’ల్లో ప్రమాదాలు, నగరవాసులకు కలుగుతున్న ఇబ్బందులు, ఆడంబరాలకు పోయి అప్పులపాలవుతున్న ఉదంతాలపై వక్ఫ్‌బోర్డు స్పందించింది. నిఖా ప్రక్రియ రాత్రి తొమ్మిది గంటలలోపు పూర్తి చేసేవిధంగా వక్ఫ్‌బోర్డు కార్యాచరణ రూపొందిస్తోంది. నిఖాకు సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8 గంటల వరకు సమయపాలన నిర్దేశించనుంది. ఈ మేరకు పెళ్లిళ్లు జరిపించే ఖాజీలకు ఆదేశాలు జారీ చేయాలని యోచిస్తోంది. 

బిర్యానీ, స్వీట్‌తో సరి: పెళ్లి విందులో ఆడంబరాలకు వెళ్లకుండా బిర్యానీ, స్వీట్‌తో సరిపెట్టే విధంగా కట్టడి చేయాలని వక్ఫ్‌బోర్డు భావిస్తోంది. పెళ్లి విందంటే లక్షల రూపాయలతో కూడుకున్న ఖర్చు. పలు వెరైటీల బిర్యానీ, మటన్, చికెన్, స్వీట్, సూప్‌ డిష్‌లు వడ్డించడం సర్వసాధారణమైంది. దీంతో ఆయా కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి.  

12 గంటలకు ఫంక్షన్‌హాల్‌ మూసివేత
బెంగళూరు, పుణే, మహారాష్ట్రల్లో పెళ్లి ఫంక్షన్‌హాల్‌లో రాత్రి 11.30 తర్వాత లైట్లు ఆర్పివేస్తారు. హైదరాబాద్‌లో మాత్రం తెల్లవారుజాము వరకు విందుభోజనాలు, ఇతర కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇటీవల ఒక బరాత్‌లో కాల్పులు, మరో బరాత్‌లో తల్వార్‌ క్రీడ కారణంగా ఒకరు మృతి చెందారు. రాత్రి 12 దాటితే ఫంక్షన్‌ హాల్‌ను మూసివేసే విధంగా చర్యలు చేపట్టనుంది. నిఖా జరిపించే ఖాజీలు, మతపెద్దలతోపాటు పోలీసు ఉన్నతాధికారులతో 23న వక్ఫ్‌బోర్డు పాలకమండలి సమావేశం కానుంది. పెళ్లి వేడుకల సమయపాలన, వివాహ విందుపై సూచనలు, సలహాలు సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సలీం పాతబస్తీలోని పోలీసులతో సమావేశమయ్యారు. బరాత్‌లో కత్తులు, డ్రమ్ముల శబ్దాలను నిషేధించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top