పోలీసులు..ప్రజలకు చేరువకావాలి

Want to Spread Frindly Policing - Sakshi

బాధితులకు సకాలంలో న్యాయం జరిగినప్పుడే

పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది

సైబరాబాద్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌

మైలార్‌దేవ్‌పల్లి: పోలీసులు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూ నేరాలు అరికట్టడంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ముందుకు సాగాలని సైబరాబాద్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ అన్నారు. సెన్సిటేషన్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌ యూనిఫాం సర్వీస్‌ డెలివరీ కార్యక్రమం శంషాబాద్‌ జోన్‌ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లోని తలాడియం లగ్జరీ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధితులకు సకాలంలో న్యాయం జరిగినప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతూ పోలీసులను గౌరవిస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేకమైన విధి విధానాలతో పోలీసు వ్యవస్థ ముందుకు వెళ్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగాన్ని ఇతర రాష్ట్ర పోలీసులు ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు.

సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత హోదాల ఆధారంగా అధికారులు స్పందించకూడదని తెలిపారు. పోలీసుల వ్యవహార శైలి సమాజంపై పడుతుందన్నారు. శాంతిభద్రతలు పరిరక్షణ, నేరరహిత సమాజం ఆవిష్కరించే ప్రయత్నాలలో ప్రజలను భాగస్వాములను చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఇటీవల సీసీ కెమెరాల సహాయంతో నగరంలో పలు ముఖ్యమైన కేసులను ఛేదించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న అనేక చర్యలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. ప్రజలందరికీ ఒకే విధమైన న్యాయాన్ని చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రజల్లో పోలీసులంటే భయం లేకుండా దైర్యంగా పోలీస్‌స్టేషన్‌లకు వచ్చే విధంగా పోలీసు వ్యవహారశైలి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ పద్మజారెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌కుమార్, శంషాబాద్‌ ఏసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ సురేందర్‌రావు, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top