వేదాలు సంస్కృతికి చిహ్నాలు

vedas are indication of our culture - Sakshi

వేదభారతి విద్యాపీఠం వ్యవస్థాపకుడు 

వేద విద్యానందస్వామీజీ 

బాసరలో ముగిసిన క్షేత్రియ వైదిక సమ్మేళనం 

భైంసా(ముథోల్‌) : వేద విద్య దేశవ్యాప్తం చేయాలని, వేదాలు సంస్కృతికి చిహ్నాలని వేద భారతి విద్యాపీఠం వ్యవస్థాపకుడు వేద విద్యానంద స్వామీజీ అన్నారు. బాసరలో నిర్వహిస్తున్న క్షేత్రియ వైదిక సమ్మేళనం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తరలివచ్చి న 108 మంది విశిష్ట వేద పండితులను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. వేదమే దేశానికి మూలమని, ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు వేద విద్యను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. గోదారమ్మకు 108 రోజులుగా నిత్యహారతి ఇస్తూనే ఉన్నామని, సూర్యచంద్రులున్నంత వరకూ హారతి కొనసాగుతూనే ఉంటుందన్నారు.  

బాసర అభివృద్ధికి కృషి : మంత్రి ఐకే రెడ్డి

బాసర ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రూ.50కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాసరలో ఉన్న వేద విద్యాలయానికి ప్రభుత్వం నుంచి ఏటా రూ.10లక్షలు అందిస్తామని, ఇందుకు సంబంధించి మార్చి మొదటి వారంలో రూ.10 లక్షల చెక్కు అందజేస్తామన్నారు. నిత్యహారతి ఘాట్‌కు వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని లెక్కించి వర్షకాలంలోనూ నిత్యహారతి ఘాట్‌ నీటిలో మునగకుండా షెడ్‌ నిర్మిస్తామన్నారు. నిత్యహారతితో బాసరకు భక్తులు పెరిగారన్నారు. బాసర అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ స్పష్టమైన హామీ ఇచ్చారని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. బాసరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు మంత్రి అల్లోల దంపతులు నిత్యహారతి ఘాట్‌ వద్ద నిర్వహించిన హోమపూజలో పాల్గొన్నారు. వేద పాఠశాల నుంచి వెలువడనున్న ‘జై శ్రీ వేదం’ మాస పత్రికను ఆవిష్కరించారు. నేత్రానందంగా సాగిన నిత్యహారతిలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొని గంగమ్మ తల్లికి పూజలు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top