
భారత ప్రశస్తి
భారతీయ ఇతిహాసాలకు ప్రజల ఆధ్యాత్మిక, సాంఘిక జీవనంలో మార్గదర్శక పాత్ర ఉంది. అందులో భారతం అజ్ఞాన తమస్సును పోగొట్టి జ్ఞానం అనే దివ్యమైన వెలుగు చూపుతుందని భావిస్తారు. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవునకు ముంజేతి సాధనం ఇది. ఈ భారతేతిహాసం వల్ల మోహం అంటే మానవ సహజమైన భ్రాంతి మటుమాయమవుతుంది. భారతం ఒక మహావృక్షం. సంగ్రహ అధ్యాయం దానికి బీజం. పౌలోమ – ఆస్తీక కథలు మూలం. కురు పాండవ జనన కథ స్కంధం. సభారణ్య పర్వాలు కొమ్మలు, అరణ్య పర్వం రూపం. విరాట – ఉద్యోగ పర్వాలు సారం. భీష్మ పర్వం ప్రధాన శాఖ. ద్రోణ పర్వం ఆకులు. కర్ణపర్వం ఆ చెట్టు పూచిన తెల్లని పువ్వులు. శల్య పర్వం ఆ పువ్వుల పరిమళం. స్త్రీ పర్వం నార. శాంతి పర్వం మహాఫలం. అశ్వమేధ పర్వం ఆ ఫల సంబంధమైన అమృతరసం. ఆశ్రమవాస పర్వం ఆ చెట్టునీడ. మౌసలం శ్రుతి సంగ్రహం. అలాంటి భారత మహావృక్షం కవుల కావ్యకృతికి పోషకం అవుతుంది.
భారత కథ వినడానికి జనమేజయుడు తగిన సమయం నిర్ణయించుకున్నాడు. ఆస్థాన పండితులను సమా వేశపరిచాడు. వైశంపాయనుడిని సముచితంగా పూజించాడు. వైశంపాయనుడు ముందుగా హృదయంలో గురు బ్రహ్మకు మొక్కి, ప్రత్యక్షంగా ఉన్న గురుమూర్తికి పాదాభివందనం చేసి, సభ్యులకు చెప్పి, వారి అనుమతితో భారత కథ చెప్పడం మొదలుపెట్టాడు. భారతం శ్రద్ధాభక్తులతో వినే వారికి ఇష్టార్థ సిద్ధినీ, శుభ సంపద్వృద్ధినీ కలిగిస్తుంది. రాజులకు రాజ్యాభివృద్ధినీ, అభ్యుదయాన్నీ సమకూరుస్తుంది. సత్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో నీతికథలను చెప్పిన మహా ప్రబంధం. అన్ని లోకాలకూ పూజ్యమైనది. ఇతిహాసాలలో అగ్రగణ్య. లౌకిక న్యాయశాస్త్రానికి గురువు. వేద వేదాంత విషయాలను బోధించేది భారతమని వైశంపాయనుడు చెప్పాడు. అంత గొప్పది కాబట్టే ‘వింటే భారతం వినాలి’ అంటారు.
– యామిజాల జగదీశ్