శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో చైత్ర బహుళ వైశాఖ మాసోత్సవాల సందర్భంగా మే లో నిర్వహించే కార్యక్రమాలను దేవస్థానం అధికారులు బుధవారం వెల్లడించారు.
భద్రాచలం (ఖమ్మం) : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో చైత్ర బహుళ వైశాఖ మాసోత్సవాల సందర్భంగా మే లో నిర్వహించే కార్యక్రమాలను దేవస్థానం అధికారులు బుధవారం వెల్లడించారు. మే 1న నూతన పర్యంకోత్సవం (ఎడబాటు ఉత్సవం) నిర్వహిస్తారు. శ్రీ సీతారాముల వివాహ వేడుక తర్వాత వచ్చే నవమి నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని 16 రోజుల పండగ అని కూడా అంటారు.
ఆ రోజున స్వామి వారికి ఏకాంత అభిషేకం, నూతన వస్త్రధారణ, రాత్రికి స్వామివారి తిరువీధి సేవ ఉంటుంది. 6న నిండు అమావాస్య సందర్భంగా స్వామి వారికి అభిషేక తిరుమంజనం, ఆలయ చుట్టూ సేవ ఉంటాయి. ఇదే రోజు నుంచి 10వ తేదీ వరకు భగవత్ శ్రీ రామానుజల వారి తిరు నక్షత్రోత్సవాలు నిర్వహిస్తారు. 11వ తేదీన శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ సందర్భంగా చిత్రకూట మండపంలో తెల్లవారుజామున ఐదు గంటలకు ఇరుముడి పూజ, పాదుకా పూజ, ఆలయ ప్రదక్షిణ, భద్రగిరి ప్రదక్షిణ, గ్రామ ప్రదక్షిణ, సంక్షేప రామాయణం హవనం జరుగుతాయి.
సాయంత్రం ఆరు గంటలకు పెద్ద రథ సేవను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. 21న శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి వారికి కల్యాణోత్సవం, 22న రథోత్సవం నిర్వహించనున్నారు. హనుమ జయంతి సందర్భంగా మే 29, 30, 31 తేదీల్లో ఉదయం స్వామి వారికి పంచామృతాభిషేకం ఉంటుంది. ఈ మూడు రోజులపాటు సుందరకాండ పారాయణాలు, హనుమాన్ చాలీసా భజనలు ఉంటాయి.
31న హనుమ జయంతి సందర్భంగా లక్ష తమలపాకుల పూజలు, అప్పాల మాలలు, వడ మాలలు, గంధ సింధూర పూజ, అరటి పళ్ల పూజ నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు కోరారు.