ఇద్దరి విద్యార్థులను బలిగొన్న లారీ | two students dies in bike and lorry crash | Sakshi
Sakshi News home page

ఇద్దరి విద్యార్థులను బలిగొన్న లారీ

Mar 23 2015 7:06 AM | Updated on Nov 9 2018 4:12 PM

స్నేహితుడి పిలుపు మేరకు ఇంటిని ఖాళీ చేసేందుకు బైక్‌పై వెళుతున్న ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరిని అతి వేగంగా వచ్చి లారీ బలిగొంది.

  మరో యువకుడికి తీవ్రగాయాలు
  నుజ్జునుజ్జుయిన ద్విచక్రవాహనం
  ఆపకుండా వెళుతున్న లారీని పట్టుకున్న గ్రామస్తులు
  కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద ఘటన
 తూప్రాన్ : స్నేహితుడి పిలుపు మేరకు ఇంటిని ఖాళీ చేసేందుకు బైక్‌పై వెళుతున్న ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరిని అతి వేగంగా వచ్చి లారీ బలిగొంది. ఈ ప్రమాదంలో మరో యువకుడు గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని కాళ్లకల్ గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ కథనం మేరకు.. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మల్లవరం లక్ష్మి, రవీందర్‌రెడ్డి దంపతుల కుమారుడు దినేష్‌రెడ్డి(20), పెరుమాళ్ల నరిసింహులు, సుశీల దంపతుల కుమారుడు శివగోపాల్ (20), సాయికిరణ్ (19)లు స్నేహితులు. వీరిలో దినేష్‌రెడ్డి, సాయికిరణ్‌లు ఐటీఐ చదువుతుండగా, శివగోపాల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా మరో మిత్రుడు శివ తన అన్నయ్య ఇంటిని ఖాళీ చేస్తున్నందున సామాన్లు సర్దేందుకు రావాలని కోరడంతో అతడి పిలుపు మేరకు పై ముగ్గురు బైక్‌పై మేడ్చల్ మండలం ఎల్లంపేటకు బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న వాహనం మండలంలోని కాళ్లకల్‌లోని బంగారమ్మ దేవాలయం వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన  రాజస్థాన్‌కు చెందిన లారీ ఢీకొంది. దీంతో ముగ్గురు యువకులు రహదారిపై పడ్డారు. ఈ ప్రమాదంలో దినేష్‌రెడ్డి తల పగిలి అక్కడిక్కడే దుర్మరణం చెందగా, శివగోపాల్ నడుంపై నుంచి లారీ చక్రం వెళ్లడంతో అతను కూడా ప్రాణాలొదిలాడు. సాయికిరణ్ మాత్రం తీవ్రంగాయాలతో బయట పడ్డాడు. అయితే బైక్‌ను ఢీకొన్న లారీ ఆపకుండా వెళ్లిపోతుండడంతో గమనించిన కాళ్లకల్ గ్రామానికి చెందిన యువకులు కారులో వెంబడించి పట్టుకున్నారు. 
 తీవ్రగాయాలు అయిన సాయికిరణ్‌ను మేడ్చల్ 108లో బాలాజీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంతోష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదే హాలను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పారిపోవడానికి యత్నించిన లారీని అదుపులోకి తీసుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమేదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. అయితే ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందడం గ్రామంలో విషాదం అలుముకుంది. తోటి విద్యార్థులు మృతి చెందడంతో సహచరులు వారి ఫొటోలను ఫ్లెక్సీలు చేసి నినాదలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement