టీడీపీ నిర్వహించే మహానాడుకు ముందు అన్ని జిల్లాల్లో మినీ మహానాడులను నిర్వహించాలని తెలంగాణ పార్టీ కమిటీ నిర్ణయించింది.
హైదరాబాద్: టీడీపీ నిర్వహించే మహానాడుకు ముందు అన్ని జిల్లాల్లో మినీ మహానాడులను నిర్వహించాలని తెలంగాణ పార్టీ కమిటీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మహా నాడు ఏర్పాట్లు, జిల్లా కమిటీల ఎన్నికలపై సమావేశం జరిగింది. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇ.పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.అరవింద్ కుమార్‌గౌడ్, సి.కృష్ణయాదవ్, పి.రాములు, బుచ్చిలింగం, కాశీ నాథ్ తదితరులు హాజరయ్యారు. ఇప్పటికే పార్టీ గ్రామకమిటీలు, వార్డు కమిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈనెల 10వ తేదీలోపు అన్ని జిల్లాల్లో మండల, డివిజన్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 11 నుంచి 17వ తేదీ వరకు జిల్లా కమిటీలకు ఎన్నికలు నిర్వహించి, కార్యవర్గాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇక 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహించనున్నారు. 27 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరిగే మహానాడులో టీడీపీని జాతీయ పార్టీగా రూపొందించేందుకు మార్గనిర్దేశం జరుగుతుందని, ఈ నేపథ్యంలో వినూత్న పద్ధతిలో మహానాడు నిర్వహిస్తామని సమావేశం అనంతరం ఎన్నికల కమిటీ నాయకులు ఇ.పెద్దిరెడ్డి, బుచ్చిలింగం, కాశీనాథ్ మీడియాకు చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి 2019 నాటికి టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బలమైన శక్తిగా రూపొందిస్తామన్నారు.
జిల్లా పార్టీ ఎన్నికలు, మినీ మహానాడు తేదీలు
టీడీపీ జిల్లా పార్టీ ఎన్నికలు ఈ నెల 11న కరీంనగర్, ఖమ్మం, 12న నల్లగొండ, 13న నిజామాబాద్, మెదక్, 14న వరంగల్, ఆదిలాబాద్, 15న మంచిర్యాల, 16న మహబూబ్‌నగర్, 17న హైదరాబాద్, రంగారెడ్డిల్లో నిర్వహించనున్నారు. మినీ మహానాడులను 16న కరీంనగర్, 17న ఖమ్మం, మంచిర్యాల, 18న నల్లగొండ, 20న ఆదిలాబాద్, 21న నిజామాబాద్, 22న మెదక్, 23న మహబూబ్‌నగర్, 24న వరంగల్‌లో నిర్వహించనున్నారు.