400 చెరువుల్లో... గోదావరి గలగలలు | Sakshi
Sakshi News home page

400 చెరువుల్లో... గోదావరి గలగలలు

Published Tue, Dec 31 2019 4:24 AM

TS Govt Planning To Fill Minmaner Water In 4000 Ponds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలతో రిజర్వాయర్‌లను పూర్తి స్థాయిలో నింపిన ప్రభుత్వం చెరువులను నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే లోయర్‌ మానేరు డ్యామ్‌ కింద చెరువులను నింపించిన ప్రభుత్వం..వందకు వంద శాతం చెరువులను నింపే పనిలో పడింది. వీటితో పాటే మిడ్‌మానేరు పరిధిలోని చెరువులతో పాటే, మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మసాగర్‌ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులకు నీళ్లందించి, వాటి కింది ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది.  

ఇప్పటికే ఎస్సారెస్పీ స్టేజ్‌–2 చెరువులకు జలకళ..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అటునుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసిన విషయం తెలిసిందే. దీంతో మేడిగడ్డ మొదలు మిడ్‌మానేరు వరకు గోదావరి అంతా జలకళను సంతరించుకుంది. మిడ్‌మానేరులోకి ఈ సీజన్‌లో మొత్తంగా 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులోంచి 30 టీఎంసీల నీటిని లోయర్‌ మానేరు డ్యామ్‌కు తరలించారు. ఆ నీటిని వదిలి తొలిసారిగా ఎస్సారెస్పీ స్టేజ్‌–2 కింద ఉన్న చెరువులను నింపే ప్రక్రియ గడిచిన రెండు నెలలుగా సాగుతోంది. స్టేజ్‌–2లో మొత్తంగా 681 చెరువులు నింపాల్సి ఉండగా, ఇప్పటికే 586 పూర్తయ్యాయి. మరో 78 చెరువులను ప్రస్తుతం నింపే ప్రక్రియ కొనసాగుతుండగా, మరో 17 నింపాల్సి ఉంది. వీటి నీటి నిల్వ సామర్థ్యం 8.63 టీఎంసీలుగా కాగా, ఇప్పటికే నిండిన చెరువులతో వాటి నిల్వ 8.10 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత యాసంగిలో స్టేజ్‌–2 కింద ఉన్న 3.97 లక్షల ఎకరాల్లో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం మిడ్‌మానేరు, లోయర్‌ మానేరులు నిండుగా ఉండటంతో నిర్దేశించిన ఆయకట్టుకు నీరందించడం పెద్ద కష్టం కాదని ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. ఇక మిడ్‌మానేరు సైతం పూర్తి సామర్థ్యంతో నిండి ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిర్దేశించిన 80 వేల ఎకరాల ఆయకట్టులో 25 వేల ఎకరాలకు ఈ సీజన్‌లో నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు నీరిస్తూనే మరో 50 చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా అధికారులను ఆదేశించారు.

అనంతగిరి ఖాళీ అయితే...
ఇక దీంతో పాటే మిడ్‌మానేరు కింద ఉన్న అనంతగిరి గ్రామాన్ని త్వరగా ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఈ గ్రామం ఖాళీ అయితే అనంతగిరి, రంగనాయక్‌సాగర్‌ రిజర్వాయర్‌లను నింపడంతో పాటు కొండపోచమ్మసాగర్‌ వరకు నీటిని తరలించవచ్చు. ఇలా నీటిని తరలించే క్రమంలో రంగనాయక సాగర్‌ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపుతూ, కొండపోచమ్మ వరకు మొత్తంగా 400 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో నింపే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటికే నింపిన చెరువులు, కొత్తగా నింపేవి కలిపి మొత్తం వెయ్యికి పైగా చెరువులను గోదావరి జలాలతో నింపే కసరత్తు వేగంగా జరుగుతోంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement