టీఆర్‌ఎస్‌ కు సిట్టింగ్‌ ఎంపీ గుడ్‌బై? | Trs Sitting Mp May Left Party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ కు సిట్టింగ్‌ ఎంపీ గుడ్‌బై?

Published Wed, Mar 27 2019 12:49 PM | Last Updated on Wed, Mar 27 2019 1:54 PM

Trs Sitting Mp May Left Party - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: పాలమూరు సిట్టింగ్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ ఇవ్వకుండా పక్కన బెట్టిన గులాబీ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకోనున్నారనే చర్చ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.ఇదే క్రమంలో కమలనాథుల చెంతకు చేరేందుకు జితేందర్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఇటీవల హైదరాబాద్‌లో జితేందర్‌రెడ్డితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చలో జితేందర్‌రెడ్డి పలు డిమాండ్లు పార్టీ ముందు ఉంచడంతో దానికి బీజేపీ అధిష్టానం ఒప్పుకుందని, ఇందులో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించాలనే డిమాండ్‌కు ఆ పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆయన కమలం గూటిలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న పాలమూరులో జరిగే బహిరంగసభకు హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఆయన  కాషాయ కండువా కప్పుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

ఇప్పటికే ఈ విషయం సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఒకవేళ జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరితే స్థానిక లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణకు కలిసొచ్చే అంశంగా కమలనాథులు అభిప్రాయపడుతున్నారు. 1999లోనే బీజేపీ నుంచి మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన జితేందర్‌రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు. మళ్లీ పాత గూటికి చేరితే.. పాలమూరులో రాజకీయాల సమీకరణల్లో మార్పులొచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

టిక్కెట్‌ ఆశించి.. భంగపడి.. 
ఇటీవల టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు జితేందర్‌రెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఇదే క్రమంలో పాలమూరు లోక్‌సభ టికెట్‌ జితేందర్‌రెడ్డికి దక్కదనే ప్రచారం అప్పట్లో విస్తృతంగా జరిగింది. దీంతో ఈ సారి టికెట్‌ తనకే వస్తుందని, గులాబీ బాస్‌ కచ్చితంగా తనకే టికెట్‌ ఇస్తారనే ఆశతో ఉన్న జితేందర్‌రెడ్డి భంగపడ్డారు.ఆయన స్థానంలో అనూహ్యంగా మన్నే శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ కేటాయించారు.

అప్పుడూ ఆయన పార్టీ వీడుతారనే ప్రచారం జరిగినా.. ఆ సమయంలోనూ కేసీఆర్‌ నిర్ణయాన్ని శిరసావహిస్తానని.. పార్టీ వీడే ప్రసక్తే లేదని జితేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కానీ తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణతో మంతనాలు జరిపి ఆమెను కమలం గూటికి చేర్చడంలో కీలకపాత్ర పోషించారు.

ఇదే క్రమంలో రెండ్రోజుల నుంచి సిట్టింగ్‌ ఎంపీ జితేందర్‌రెడ్డితోనూ మంతనాలు జరిపి, ఆయన్ను పార్టీలో ఆహ్వానించారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే జితేందర్‌రెడ్డి మాత్రం తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన ఆయన ఒకవేళ పార్టీని వీడితే మీడియా సమక్షంలోనే వివరాలు వెల్లడిస్తానని ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement