కమ్యూనికేషన్‌ కోసం కసరత్తు

Training for communication - Sakshi

సింగరేణి సీఎండీ శ్రీధర్‌

మల్టీ డిపార్ట్‌మెంట్‌ టీంల ద్వారా గనుల్లో సదస్సులు

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి యాజమాన్యం, కార్మికులకు మధ్య సరైన కమ్యూనికేషన్‌ కోసం ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. సింగరేణి ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలు, గనుల్లో ఉత్పత్తి లక్ష్యాలు, సాధించలేక పోవడానికి గల కారణాలు, ఓపెన్‌కాస్ట్‌(ఓసీ) గనుల యంత్రాల పనితీరు వంటివాటిపై కార్మికులకు వివరించాలని నిర్ణయించారు. సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా భారీ కమ్యూనికేషన్‌ కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నారు.

సదస్సులు, సమావేశాలకు ఐఈడీ విభాగం ఏరియా జనరల్‌ మేనేజర్లు సారథ్యం వహించనున్నారు. సింగరేణిలో మొత్తం 19 ఓసీ గనులు, 29 భూగర్భ గనులు, వర్క్‌షాపులు, తదితర విభాగాల నుంచి 54 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి ఆర్థిక స్థితి, ప్రణాళికలు, ఉత్పత్తి వంటి విషయాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్నారు. అనంతరం ఆయా అంశాలపై కార్మికుల అభిప్రాయాలు సేకరించనున్నారు. కార్మికుల ఇబ్బందులను తొలగించేలా వారి నుంచి సూచనలు, సలహాలను స్వీకరించనున్నారు.

గతంలో ఇలాంటి సమావేశాల్లో కార్మికుల సలహాలు, సూచనలపై శ్రీధర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు గనుల్లో క్యాంటీన్ల పరిశీలన, వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో దీన్ని భారీ పరస్పర ప్రయోజనకర కమ్యూనికేషన్స్‌ ప్రక్రియగా సీఎండీ శ్రీధర్‌ భావించి ఏటా సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. యంత్రాల వినియోగం, గనుల్లో నష్ట నివారణ చర్యలు వంటి అంశాలను పొందుపరిచిన సీఎండీ లేఖను ఆదివారం నుంచి అన్ని ఏరియాల్లో పంపిణీ చేయనున్నారు.

టీంలు సంసిద్ధం
ప్రతి ఏరియాలో ఈ సమావేశాల కోసం ఏరియా జీఎం అధ్యక్షతన పర్సనల్, ఫైనాన్స్, ఐఈడీ, సేఫ్టీ అధికారులతో కూడిన మల్టీ డిపార్ట్‌మెంట్‌ టీంలను సిద్ధం చేశారు. సమావేశాలు, సదస్సుల్లో కార్మికులకు అర్థమయ్యే విధంగా వివరాలను వివరిస్తారు. మొత్తం 250కిపైగా సమావేశాలు నిర్వహించి సింగరేణిలోని ప్రతి కార్మికుడికి సందేశం చేరేలా ఏర్పాటు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top