
ముక్కోటికి భద్రాద్రి ముస్తాబు
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయం ముక్కోటికి ముస్తాబవుతోంది.
నేడు తెప్పోత్సవం– రేపు ఉత్తరద్వార దర్శనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయం ముక్కోటికి ముస్తాబవుతోంది. ఆదివారం సాయంత్రం గోదావరి నదిలో జరిగే తెప్పోత్సవం, సోమవారం తెల్లవారుజామున జరిగే ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సుమారు 50 వేల మంది వస్తారనే అంచనాలతో జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెప్పోత్సవం ప్రారంభం అవుతుంది. సోమవారం వేకువజామున 3 గంటలకు ఉత్తరద్వారంలో స్వామివారిని వేంచేయింపజేస్తారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా గోదావరి స్నానఘట్టాల రేవు, మిథిలాస్టేడియం ప్రాంగణాల్లో టెంట్లు ఏర్పాటు చేశారు.
రెండు లక్షల లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో రమేష్‌బాబు తెలిపారు. దేవస్థానం తూర్పు మెట్ల వైపు ఉన్న ప్రత్యేక కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాదాలను అందించేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాన్ని ఉచితంగానే తిలకించవచ్చు. అయితే, ఉత్తర ద్వార దర్శనానికి మాత్రం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకంగా సెక్టార్‌లను ఏర్పాటు చేశారు. రూ.1000, 500, 250 విలువైన టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలను చోటు చేసుకోకుండా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా నేతృత్వంలో భద్రాచలం డీఎస్పీ అశోక్‌కుమార్ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.