టమాటా ధర పైపైకి!

Tomato Price at Rs 30 in open market - Sakshi

బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.30కి చేరిన ధర.. 

పొరుగు రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతి

సాక్షి, హైదరాబాద్‌: టమాటా ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గిన ధరలు మళ్లీ చుక్కలనంటుతున్నాయి. రాష్ట్రంలో సాగు తగ్గడం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి లేకపోవడంతో కిలో ధర రూ.30 పలుకుతోంది. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 15–20 రోజుల క్రితం టమాటా ధర కిలో రూ.10 వరకే పలికింది. రైతుబజార్‌లో కిలో రూ.5 నుంచి రూ.8 వరకు ఉంది. రాష్ట్రంలో అధికంగా సాగు చేసే మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సాగు తగ్గిపోయింది.

ఈ జిల్లాల్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాల్లో భారీ క్షీణత ఏర్పడింది. దీంతో ఈ జిల్లాల నుంచి మార్కెట్‌లోకి టమాటా రావడం లేదు. దీంతో ఏపీలోని మదనపల్లి నుంచి, కర్ణాటకలోని కొలార్, చిక్‌మగళూర్‌ల నుంచి దిగుమతి అయ్యే టమాటాలపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి నుంచి సైతం దిగుబడి తగ్గింది. మదనపల్లె  మార్కెట్‌లో టమాటా ధరలు కొన్ని రోజులుగా పుంజుకున్నాయి.

పదిరోజుల కిందట అత్యల్పంగా కిలో ధర రూ.4 నుంచి అత్యధికంగా రూ.10 వరకు మాత్రమే పలికింది.  దిగుబడి తగ్గడంతోపాటు సీజన్‌ ప్రారంభం కావడంతో టమాటా మార్కెట్‌కు 100 టన్నుల నుంచి 140 టన్నుల వరకే వస్తోంది. డిమాండ్‌ పెరుగుతున్న కారణంగా మదనపల్లె టమాటా ధర పుంజుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన టమాటా కిలో రూ.22 వరకు పలుకుతోంది. ఈ ప్రభావం మన రాష్ట్రంపై పడుతోంది. ఈ నెల 29న పొరుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ మార్కెట్‌కు 1,510 క్వింటాళ్లు టమాటా రాగా, సోమవారం కేవలం 884 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం రైతుబజార్‌లోనే టమాటా కిలో ధర రూ.24 పలకగా, బహిరంగ మార్కెట్‌లో కిలో ధర రూ.30కి చేరింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఇదే సమయంలో రాజస్థాన్‌ నుంచి పెద్ద సంఖ్యలో టమాటా రాష్ట్ర మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడి నుంచి రావడం లేదు. ఈ దిగుమతులు పెరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుందని, లేని పక్షంలో మరో 3 నెలలపాటు ధరల్లో పెరుగుదల తప్పదని మార్కెట్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top