
కిలో రూపాయిన్నరే
మరింత దిగజారిన ధర
రైతుల గగ్గోలు
ఆదుకోని కూటమి ప్రభుత్వం
ఆర్భాటపు ప్రకటనలతో సరి!
పత్తికొండ/తుగ్గలి: టమాట ధరలు మరింత క్షీణిస్తున్నాయి. ఆదివారం కిలో రూపాయిన్నరకు పడిపోయింది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వమే టమాటాను కొంటుందని ఆర్భాటపు ప్రకటనలు చేసిన కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కర్నూలు జిల్లా పత్తికొండ టమాట మార్కెట్‌లో ఆదివారం 25 కేజీల జత గంపల ధర రూ. 50 నుంచి రూ.80లోపు పలికింది. ఈ లెక్కన చూస్తే కేజీ టమాటాకు లభించింది కేవలం రూపాయిన్నరే. మార్కెట్‌లో ఈ రోజు 400 క్వింటాలును వ్యాపారులు కొన్నారు. దాదాపు 12 లారీల్లో ఇతర ప్రాంతాలకు టమాటా ఎగుమతైంది.
ఒక్కరోజుకే చేతులెత్తేసిన వైనం
శనివారం ఉదయం మార్కెట్‌లో సుడిగాలి పర్యటన చేసిన మార్కెటింగ్ డెప్యూటీ డైరెక్టర్ లావణ్య.. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కిలో రూ. 7నుంచి రూ.8లోపు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. సరుకును విజయవాడ, గుంటూరు మార్కెట్లతోపాటు రైతుబజార్‌లకు సరఫరా చేస్తామని ప్రకటించారు. అయితే అధికారులు ఒక్కరోజులోనే చేతులెత్తేశారు.
ఒక్క టమాట కూడా కొనలేకపోయారు. దీంతో రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధరకు ఎలా పంట అమ్మాలని, రెండురోజుల నుంచి పంటను మార్కెట్‌కు తీసుకొస్తున్న తమకు తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లడానికి చార్జీలూ రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కొందరు టమాటాలను మార్కెట్లోనే వదిలి వెళ్లిపోతున్నారు.
ఇలా అయితే ఎలా?
మార్కెట్‌కు 31 గంపలు తీసుకువచ్చాను. టమాటా నాణ్యంగా ఉంది. 25 కేజీల జత గంపలను రూ.80కు కొన్నారు. రూ. 10 కమీషన్ తీసుకున్నారు. ఈలెక్కన కిలోకు రూపాయి, రూపాయిన్నర మాత్రమే రైతులకు దక్కుతోంది. పొలం నుంచి ఆటోలో టమాట రవాణాకు రూ.300 ఖర్చయింది. ఇలా అయితే ఎలా? – పవన్, రైతు, పత్తికొండ
ఇచ్చిన హామీని అమలు చేయరా?
మార్కెట్‌లో శనివారం రోజు అధికారులు కిలో రూ.8తో ప్రభుత్వం కోనుగోలు చేస్తుందని చెప్పినారు. తీరా ఆదివారం రోజు వ్యాపారులు మాత్రమే వేలంలో పాల్గొని కిలో రూపాయిన్నరకు కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ఏమైంది? లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేశాం. ఇలా అయితే రైతులు పరిస్ధితి దారుణంగా మారుతుంది. – హుస్సేన్, రైతు, కొట్టాల
గిట్టుబాటు ధరలేక ఉల్లి పంటను దున్నేసి...
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఆగవేళి గ్రామంలో ఓ రైతు ఉల్లి పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. గ్రామానికి చెందిన పాతింటి లక్ష్మన్న ఐదు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాడు. 20 రోజుల క్రితం పంటను మార్కెట్‌కు తీసుకెళ్లగా క్వింటా రూ.800కి అమ్మకున్నాడు.
మరో రెండు ఎకరాల్లో ఉన్న పంటను మూడు రోజుల క్రితం మార్కెట్‌కు తీసుకెళ్లగా క్వింటా రూ.300 మాత్రమే పలికింది. దీంతో వచ్చిన డబ్బులు కోయడానికి కూడా చాలవని పొలంలోనే పంటను గొర్రెలకు మేపాడు. అనంతరం ట్రాక్టర్‌తో దున్నేశాడు. ఇప్పటికే పంట సాగుకు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వాపోయాడు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలేగతని కన్నీటి పర్యంతమయ్యాడు. – కృష్ణగిరి