ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను తలదన్నేలా..

Tiffin with 20 Kinds Of Curry And 20 Varieties Of Items In Khammam Hotel - Sakshi

20 రకాలతో భోజనం, అల్పాహారంతో క్యాటరింగ్‌లో ప్రత్యేకత 

అక్కడ తిన్న వారెవరైనా చెప్పేదదే..  

అశ్వారావుపేటలో కాస్ట్‌లీ క్యాటరింగ్‌  

రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ  

సాక్షి, అశ్వారావుపేట( ఖమ్మం) : అది ఐదు నక్షత్రాల (ఫైవ్‌ స్టార్‌) హోటల్‌ కాదు. కనిపించీ కనిపించని లైటింగ్‌ ఉండదు. యూనిఫాం వేసుకుని వడ్డించే వారు అక్కడ కనిపించరు. కానీ, ప్లేట్‌లో ఉండే ఐటెమ్‌లు మాత్రం ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను తలదన్నేలా ఉంటాయి. అక్కడి రుచి అలాంటి హోటళ్లను మైమరిపిస్తాయి. 20 రకాల కూరలతో భోజనం, 20 రకాల ఐటెంలతో టిఫిన్‌ ఆరగిస్తూ అక్కడి ప్రజలు నూతన అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఇదంతా అశ్వారావుపేటకు చెందిన, చేయి తిరిగిన చెఫ్‌ మున్నా చేస్తున్న అద్భుతం. తొలుత ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ పెట్టి తీసేసి, ప్రస్తుతం కేటరింగ్‌ మారి సక్సెస్‌ సాధించాడు. ప్లేట్‌ భోజనం రూ.250 అయినప్పటికీ అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే అతడి చేయి నుంచి వచ్చిన వంటలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

అశ్వారావుపేటకు చెందిన చెఫ్‌ మున్నా తొలుత విశాఖపట్టణంలో హోటల్లో వంటలకు సంబంధించిన కోర్సు చేశాడు. అనంతరం వంటల్లో ప్రావీణ్యం సంపాదించాడు. స్వగ్రామమైన అశ్వారావుపేటలో హోటల్, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను నిర్వహించాడు. అశ్వారావుపేట వంటి గ్రామీణ ప్రాంతంలో వ్యాపారం ముందుకు సాగక దానిని నిలిపివేశాడు. కానీ, మున్నా వంటకాలకు అలవాటు పడిన సన్నిహితులు, బంధుమిత్రులు తమ ఇంట్లో జరిగే వేడుకలకు మున్నాను సలహాలు, సూచనలతో మెనూ సిద్ధం చేసేవారు. అలా అలా పలు శుభకార్యాలకు మున్నా మార్క్‌ చూపించాడు.

దీంతో పలు సమావేశాలకు వీఐపీ భోజనం కావాలంటే అశ్వారావుపేటలో మున్నాను ఆశ్రయించాల్సిందేననే పేరు సంపాదించాడు. వంటను ఓ ప్రవృత్తిగా భావించి ఐదేళ్లపాటు ఎలాంటి ఫీజు లేకుండా వంటలు చేసిన మున్నా మిత్రుల కోరిక మేరకు క్యాటరింగ్‌ రంగంలోకి బలవంతంగా అడుగుపెట్టాడు. ఒక్కో తలకు భోజనం వెల రూ.250 మాత్రమే. అంత ఖరీదైన భోజనం.. అదీ అశ్వారావుపేటలో అంటే కొందరు ముక్కున వేలు వేసుకున్నారు. కానీ, అందులోని భిన్న రకాల కూరలు తెలుసుకున్నాక ఆ ధర సరైనదేనని ప్రజలు భావించారు.  

చూస్తే నోరూరాల్సిందే
మున్నా మెనూను చూడగానే కడుపు నిండుతుందని భోజన ప్రియులంటున్నారు. వెజ్‌ స్టార్టర్స్, ఫ్రూట్స్‌ స్నాక్స్, చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఒకే ప్లేట్‌లో వడ్డించడం మున్నా ప్రత్యేకత. వంకాయ, పెరుగు చట్నీ, కొబ్బరి అన్నం, ఉలవచారు చికెన్, ఉలవచారు ఎగ్, గోంగూర బోటీ, పుష్కా, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి దోశ, జొన్న దోశ, రాగి సంగటి, జొన్న సంటి, నాటుకోడి, ఇంకా ఫ్రూట్‌జ్యూస్‌లు ఇలా అతడు చేసే ఏ వంటకమైనా అదిరిపోవాల్సిందే. 20 రకాల వంటకాలతో టిఫిన్, 20 రకాల ఐటమ్స్‌తో భోజనం, 10 రకాల పండ్లతో స్టార్టర్స్‌.. ఇలా రంగురంగుల పండ్లతో కళ్లు జిగేల్‌ మనిపిస్తుంటాడు. ఓసారి మున్నా మెనూ వింటే ఎంతయినా తినాలనిపిస్తుందని పలువురు చెబుతున్నారు. అశ్వారావుపేటకు అప్పుడప్పుడు హైదరాబాద్‌ నుంచి వచ్చే కొందరు ప్రముఖులు మున్నా మెనూకు ముగ్ధులవుతుంటారు.

హైదరాబాద్‌ వచ్చేయమని కోరుతుంటారు. కానీ, మున్నా సున్నితంగా తిరస్కరిస్తాడు. మున్నా తల్లి భారతికుమారి ఐసీడీఎస్‌లో సీడీపీఓగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పోషకాలతో కూడిన వంటకాలపై ఆమెకున్న పట్టు మున్నాకు వారసత్వంగా వచ్చింది. తల్లి ఆశీస్సులతో తల్లి సమక్షంలోనే నాణ్యమైన వంటలు అందిస్తానంటున్నాడు మున్నా. చాలా ఖరీదైన మెనూ కాబట్టి అశ్వారావుపేట వంటి గ్రామీణ ప్రాంతంలో కొనసాగడం గొప్ప విషయమే. అయితే, మున్నా మెనూ టేస్ట్‌ చేయాలంటే అశ్వారావుపేట వచ్చి ముందుగా 99856 61117 నంబర్‌కు ఆర్డర్‌ ఇవ్వాలి. ఎందుకంటే హోటల్‌లా నిత్యం సమయానికి వండి సిద్ధంగా ఉంచరు కదా. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top