అనాథల సేవలో యువ దంపతులు | The young couple is in the service of orphans | Sakshi
Sakshi News home page

అనాథల సేవలో యువ దంపతులు

Mar 23 2015 3:29 AM | Updated on Sep 2 2017 11:14 PM

‘సొంత లాభం కొంత మానుకొని తోటివారికి సాయపడవోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఈ దంపతులు మాత్రం సొంతానికంటూ ఏమి లేకుండా కష్టార్జితమంతా...

మహబూబాబాద్ : ‘సొంత లాభం కొంత మానుకొని తోటివారికి సాయపడవోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఈ దంపతులు మాత్రం సొంతానికంటూ ఏమి లేకుండా కష్టార్జితమంతా అనాథలకే వెచ్చిస్తూ వారికి ప్రేమను పంచుతున్నారు. యుక్తవయసులోనే ఆ దంపతులు అనాథలను చేరదీసి చేయూతనందిస్తున్నారు. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన బల్లెం విజయ్‌కుమార్, విక్టోరియా దంపతులకు రెండేళ్ల క్రితమే వివాహమైంది.

వారికి ఏడాది పాప ఉంది. బల్లెం విజయ్‌కు అనాథాశ్రమం నడపాలని తన ఆశయం. అందుకు తాను పెళ్లి చేసుకున్న భార్య కూడా సహకరించటం ఆయనకు మరింత బలాన్ని చేకూర్చింది. బ్యాంక్ కాలనీ సమీపంలో చిన్నగది ఉన్న ఇల్లు నెలకు 1500 చొప్పున అద్దెకు తీసుకుని పిల్లలతో పాటు ఆ దంపతులు ఆ గదిలోనే ఉంటున్నారు. సుమారు 9 మంది అనాథలను చేరదీసి వారిని ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. గది అద్దె తక్కువ కావడంతో ఎలాంటి సౌకర్యాలు లేవు. దూరంగా వెళ్లి ఆ దంపతులు బోరింగ్ వద్ద నీళ్లు తెచ్చుకుంటున్నారు.
 
సౌండ్ సిస్టమే ఆశ్రమానికి ఆధారం..
సౌండ్ సిస్టమ్ నడుపుతూ ఇతరత్రా పనులు చేస్తూ విజయ్ కుమార్ తన ఆదాయంతో అనాథ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఇటీవల కాజీపేటకు చెందిన పాస్టర్ కురియన్ నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాడు. మరో ఇద్దరు చెరో రూ.1000 చొప్పున సాయం చేస్తున్నారు.
 
వారు చేసే సాయం కిరాయికి పోను మిగిలిన డబ్బులు సరిపోవడం లేదు. ఆశ్రమం పేరుతో అధికారుల వద్దకు, వ్యాపారుల వద్దకు నిర్వాహకులు వెళ్లడం లేదు. కానీ ఆ ఆశ్రమం గురించి తెలిసిన అధికారులు అక్కడికి వెళ్లి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ నెల 15న డీఎస్పీ డి.నాగరాజు ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు ఆశ్రమాన్ని చూశారు. దాని గురించి ఆరాతీసి ఆ దంపతులు చేస్తున్న సేవను తెలుసుకుని ఆశ్రమానికి వెళ్లారు. వెంటనే ఆయన స్పందించి క్వింటా బియ్యం, పిల్లలకు, ఆ దంపతులకు దుస్తులను, ఇతర సామగ్రి అందజేశారు. ఇంటికి నెల అద్దె తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దాతలు ముందుకొచ్చి సదుపాయాలు కల్పిస్తే ఆ అనాథలు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారు.  
 
కష్టంగానే నడుపుతున్నాం.. అయినా సంతోషంగా ఉంది
నా భర్త ఆశయం ఆశ్రమం నడపాలని. అందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. వారికి వంట చేసి ఆలనా పాలనా చూసుకుంటున్నాను. డబ్బులపరంగా ఇబ్బంది అవుతున్నా వచ్చిన ఆదాయంలో వంట చేస్తూ పిల్లలకు పెడుతున్నాను. నా పిల్లల్లా చూసుకుంటున్నాను. కష్టం ఎక్కువగా ఉన్నా దానిలోను ఎంతో సంతోషం ఉంది. ఊరికి వెళ్లినా మాతో పాటుగా తీసుకెళ్తాం. మా పిల్లల లాగానే ప్రేమతో చూసుకుంటున్నాం.  
  - విక్టోరియా, నిర్వాహకురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement