ఉద్యోగాల భర్తీకి కసరత్తు | The recruitment exercise | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల భర్తీకి కసరత్తు

Mar 20 2015 2:04 AM | Updated on Aug 15 2018 9:27 PM

ఉద్యోగాల భర్తీకి కసరత్తు - Sakshi

ఉద్యోగాల భర్తీకి కసరత్తు

విభాగాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు పంపించాలని తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎం కార్యాలయం లేఖ రాసింది.

  • ఖాళీల వివరాలివ్వాలని అన్ని శాఖలకు సీఎంవో లేఖ  
  • రిమైండర్ జారీ చేసిన ఆర్థిక శాఖ
  • సాక్షి, హైదరాబాద్: విభాగాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు పంపించాలని తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎం కార్యాలయం లేఖ రాసింది. త్వరలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కౌన్సిల్ సమావేశాల్లో స్వయంగా సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. జనవరి 31నే ఖాళీలకు సంబంధించి తెలంగాణ ఆర్థిక శాఖ అన్ని విభాగాలకు లేఖలు రాసింది.

    రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు తప్ప మిగతా ఖాళీల వివరాలను ఫిబ్రవరి 15లోగా సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటికీ సగానికిపైగా విభాగాల నుంచి ఖాళీల వివరాలు అందకపోవడంతో వెంటనే వివరాలు సమర్పించాలని 32 విభాగాల కార్యదర్శులకు ఆర్థిఖ శాఖ రిమైండర్ జారీ చేసింది. మరోవైపు సీఎంవో కార్యాలయం లేఖ పంపించటంతో ఖాళీల వివరాల సేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. వీటి ఆధారంగానే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి... ఏయే విభాగాల్లో అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరముందని.. ప్రభుత్వం అంచనాకు రానుంది.

    జెన్‌కోలో పోస్టుల భర్తీకి ఇప్పటికే సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మైనారిటీ విద్యాసంస్థల్లో టీచర్ల పోస్టులను, మైనారిటీ విభాగంలో అత్యవసరమైన ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం జిల్లా స్థాయి, జోనల్, మల్టీ జోనల్‌కు సంబంధించిన ఖాళీల వివరాల సేకరణ మొదలైంది. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల భర్తీ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. వీటి నియామకానికి రాష్ట్ర విభజన వ్యవహారాలతో పీటముడి పడింది. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులన్నింటినీ తెలంగాణ, ఏపీల మధ్య విభజించాల్సి ఉంది.

    ఈ అంశం ప్రస్తుతం కమలనాథన్ కమిటీ పరిధిలో ఉన్నందున కమిటీ తుది నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే. ఈ లోగా డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మిగతా కేడర్ పోస్టులు భర్తీ చేసేందుకు సర్కారు ఆలోచన చేస్తోంది. అందుకే జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల వివరాలు మాత్రమే ఆరా తీస్తోంది. టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఆడిటర్లు, టెక్నికల్ సిబ్బంది, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని గ్రూప్-2 ఉద్యోగాలు సైతం ఇదే పరిధిలోకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement