మట్టిదిబ్బ కూలి 10 మంది సమాధి

Ten people dead in Narayanpet - Sakshi

నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేర్‌లో ఘటన 

నారాయణపేట/మరికల్‌: వారంతా రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీలు. రోజువారీ లాగే ఉపాధిహామీ పనుల కోసం ఊరి శివారులోకి వెళ్లారు. అక్కడ ఎండకు తాళలేక ఓ గుట్ట నీడన నీళ్లు తాగేందుకు వెళ్లారు. అంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది. పైభాగంలో ఉన్న మట్టిదిబ్బ ఒక్కసారిగా వారిపై కూలిపడటంతో పది మంది మహిళా కూలీలు మట్టిలో సజీవసమాధి అయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలోని తీలేర్‌లో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
 
అప్రమత్తం చేస్తుండగానే.. 
తీలేర్‌ గ్రామానికి చెందిన ఆరు గ్రూపుల ఉపాధి హామీ కూలీలు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. జాన్సీ, దవ గ్రూపుల వారు మాత్రం బుధవారం ఉదయం 9 గంటలకు తీలేర్‌ శివారులోని ఎద్మరితిప్పగుట్ట వద్ద నీటి నిల్వ గుంతల (కందకాలు) పనులు చేసేందుకు వెళ్లారు. ఈ గ్రూపుల్లో మొత్తం 50 మంది కూలీలు ఉన్నారు. ఎండ ఎక్కువ కావడంతో 11 గంటల ప్రాంతంలో 12 మంది మహిళా కూలీలు గుట్టనీడలో ఉంచిన నీళ్లు తాగేందుకు వెళ్లారు. అదే సమయంలో ఓ చిన్న మట్టిపెళ్ల బోయిని మణెమ్మ అనే కూలీ మీద పడింది. వెంటనే తేరుకున్న ఆమె గుట్ట కూలేటట్టు ఉందని మిగతా కూలీలను అప్రమత్తం చేస్తుండగానే.. ప్రమాదం ఉప్పెనలా వచ్చింది. ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలడంతో పది మంది మట్టికింద సమాధి అయ్యారు. ప్రమాదం నుంచి తప్పించుకున్న మణెమ్మ ఈ విషయాన్ని చుట్టుపక్కల కూలీలకు తెలియజేయడంతో వారంతా ప్రమాదస్థలికి చేరుకున్నారు. వారంతా పారలతో మట్టిని తీయగా లక్ష్మి అనే కూలీ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా ఆమెను 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.  
బుధవారం నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేర్‌ శివారులో మట్టిదిబ్బలు కూలిన స్థలాన్ని పరిశీలిస్తున్న జనం.  

జేసీబీతో మృతదేహాల వెలికితీత 
గ్రామస్తులు హుటాహుటిన జేసీబీని రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. మట్టిని తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మూడు మృతదేహాలు గుర్తుపట్టనంతగా ఛిద్రమయ్యాయి. మృతదేహాలను బయటకు తీయడానికి రెండు గంటల సమయం పట్టింది. బాధిత కుటుంబ సభ్యుల రోదన.. చూసేవారిని కలచివేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణ పేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.  

మృతుల్లో అత్త, కోడలు.. 
మృతి చెందిన వారిలో అత్త, కోడలు ఉన్నారు. చర్లపల్లి లక్ష్మి, హన్మంతు దంపతుల కుమారుడు వెంకటయ్య అదే గ్రామానికి చెందిన అనురాధను పెళ్లి చేసుకున్నాడు. బుధవారం ఉదయం 8.45 గంటల సమయంలో అత్తాకోడళ్లు లక్ష్మి, అనురాధ ఇంటి నుంచి కూలీ పనులకు వెళ్లారు. మట్టి దిబ్బలు కూలిన సంఘటనలో అత్త, కోడలు చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలు అనురాధకు కుమా రుడు, కూతురు ఉన్నారు. ఈ రెండు కుటుంబాలు రోజువారీ కూలి పనుల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. 

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం  
మట్టి పెళ్లలు కూలి మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హామీ ఇచ్చారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన హుటాహుటిన మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా కలెక్టర్లతో కలసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు, అంత్యక్రియల కోసం రూ.ఐదు వేలను తక్షణ సాయం కింద అందజేస్తామన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించే విషయాన్ని అధికారికంగా చెప్పడం కుదరడం లేదన్నారు. ఎన్నికల తర్వాత బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: చాడ వెంకటరెడ్డి 
నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేరులో మట్టి దిబ్బల కింద పడి మరణించిన కూలీల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. అలాగే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కోరింది. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జిల్లా స్థాయిలో ఉన్న విజిలెన్స్, మానిటరింగ్‌ బృందాలు ఉపాధి పనుల ప్రాంతాలను పరిశీలించకపోవడం వల్ల విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు నీడ, నీటి వసతి కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.  

నిబంధనలు పెడచెవిన పెట్టడం వల్లే.. 
ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి రూపొందించిన నిబంధనలను అధికారులు పెడచెవిన పెట్టిన కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం విమర్శించారు. నిబంధనలు సరిగ్గా పాటించక పోవడంతో పాటు అధికారులు పని స్థలాల్లో అందుబాటులో లేరని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీఎం దిగ్భ్రాంతి 
నారాయణపేట జిల్లాలో జరిగిన దుర్ఘటనలో ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా మంత్రిని, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వర్షానికి తడవడంతో కూలిన మట్టిదిబ్బ!
నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేర్‌ శివారులోని ఎద్మల్‌తిప్పగుట్ట వద్ద మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి మట్టి బాగా తడిసిపోయినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే బుధవారం అక్కడికి పనికి వెళ్లిన కూలీలపై మట్టిదిబ్బ ఒక్కసారిగా కూలిందని చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తీలేర్‌ సంఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, కలెక్టర్‌ వెంకట్‌రావులను ఘెరావ్‌ చేశారు. వారిని మంత్రి సముదాయించి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమిం చారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఘటనపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఎన్నికల వేళ కావడంతో సంఘటన స్థలానికి రాలేకపోతున్నానని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందుతుందని సీఎం భరోసానిచ్చారు.  

ఆస్పత్రి వద్ద ఆందోళన  
నారాయణపేట ఎస్పీ చేతన సంఘటన స్థలానికి చేరుకుని మంత్రి ఆదేశాల మేరకు మృతదేహాలను ప్రత్యేక వాహ నాల్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న ఎస్పీ చేతన కలగజేసుకుని ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉందని ఇలాంటి వాటికి తావివ్వొద్దంటూ వారిని శాంతింపజేశారు.  

రాస్తారోకో.. నిలిచిన వాహనాలు 
మృతదేహాలను గ్రామానికి తీసుకువస్తున్న సమయంలో బంధువులు, గ్రామస్తులు మరోసారి ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ తీలేర్‌ స్టేజి వద్ద హైదరాబాద్‌–రాయచూర్‌ జాతీయ రహదారిపై మృతదేహాలతో రెండు గం టల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చివరకు కలెక్టర్‌ అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. ప్రస్తు తం ఎన్నికల కోడ్‌ ఉన్నందున స్పష్టమైన హామీ ఇవ్వలేమని, మృతుల అంత్యక్రి యలకు రూ.ఐదు వేలు, ఆపద్బంధు కింద రూ.50 వేల చొప్పున ఇప్పుడే ఇస్తామని స్పష్టంచేశారు. గురుకులంలో పిల్లలకు సీట్లు ఇస్తామని, ఇళ్ల స్థలాలపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని వారికి నచ్చజెప్పారు. అలాగే రూ.ఐదు లక్షలు చొప్పున పరిహారం అందించేలా ఎన్నికల కమిషన్‌కు నివేదించామని, అక్కడి నుంచి అనుమతి వస్తే వారికి నగదు అందజేస్తామనని ఆందోళన విరమింపజేశారు.

ఆ కొద్ది నిమిషాల్లోనే.. 
పని పూర్తయ్యే దశలో ఉండగా ఓ జాతీయ రాజకీయ పార్టీకి చెందిన నేతలు కొందరు ఉపాధి కూలీల వద్దకు వచ్చా రు. వారితో మాట్లాడాల్సి ఉందని చెప్ప డంతో కొందరు మహిళలు నీరు తాగేందుకు మట్టిదిబ్బ నీడ చెంతకు వెళ్లారు. ఇంకొందరు కొద్ది దూరంలో ఉన్న చెట్టు నీడకు చేరుకున్నారు. అయితే వర్షానికి తడిసిన మట్టి దిబ్బ, మహిళలు దాని చెంతకు చేరుకు న్న కొద్ది నిమిషాల్లోనే హఠాత్తుగా వారిపై కుప్పకూలింది. దీంతో దిబ్బ కింద ఉన్న కూలీల్లో పదిమంది చనిపోయారు.

నీడకు కూసందమని పోయాం..
కొంచెం సేపు నీడకు కూసందమని ఆడవాళ్లం మట్టిగోడ సాటుకు వెళ్లాం. అందరం కూర్చొని కూలీ పనిపై మాట్లాడుకుంటున్నాం. కొంతసేపటికి మట్టిదిబ్బ కూలి మాపై పడింది. నేను పూర్తిగా మట్టిలో మునిగిపోయిన తలకాయ ఒక్కటి కొంత తేలుకొని ఉంటే అరవడంతో పక్కల ఉన్న వాళ్లు వచ్చి నన్ను లేపారు. మట్టి బెడ్డలు పడడంతో నా కాలు విరిగింది. నాకు, నా భర్త కల్యాణ్‌కు ఎలాంటి ఆధారం లేదు రోజు కూలీ పని చేసుకుని బతుకుతున్నాం. 15రోజుల నుంచి అక్కడ పని చేస్తున్నాం. గుంతలు లోతుగా తీయడంతో మట్టికూలినట్లు అనిపిస్తుంది. మేము పని చేసే దగ్గర్లో చెట్లు లేకపోవడంతో రెండు రోజుల నుంచి అదే గోడ సాటుకు నీడన కూర్చుంటున్నాం. ఇప్పుడు నా కాలు విరిగింది..మేము ఎలా బతకాలి. మాకు రోజు కూలీ పని తప్ప ఎలాంటి ఆధా రం లేదు. మధ్యాహ్నం ఒంటి గంటకు దవాఖానకు వచ్చిన. డాక్టర్లు చూసి తొడలో ఎముక విరిగింది. ఇనుప రాడ్‌ వేయాలని చెబుతున్నారు.    
    – లక్ష్మి, ప్రమాదంలో గాయపడిన ఉపాధి కూలీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top