చలికే వణుకు!

Temperature Down in Hyderabad - Sakshi

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శీతల పవనాలు   

రగ్గుల కొనుగోళ్ల వైపు సిటీజనుల చూపు   

రాత్రిపూట కప్పుకొనేందుకు వెసులుబాటు  

నాలుగు రోజులుగా జోరుగా విక్రయాలు    

విదేశీ బ్రాండ్లను ఇష్టపడుతున్న సిటీజనులు

సాక్షి, సిటీబ్యూరో: పెథాయి తుపాను ప్రభావంతో నగరంలో చలి గజగజ వణికిస్తోంది. సిటీలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూలేనంతగా పడిపోవడంతో శీతల పవనాలతో సిటీజనులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తుల వైపు మళ్లుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ ఒంటికి వెచ్చదనాన్ని ఇచ్చే పలు రకాల రగ్గులు ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. దీంతో నగర మార్కెట్లలో దేశీయ, విదేశీ రగ్గుల విక్రయాలు జోరందుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు చలిని తట్టుకోవడానికి స్వెటర్లు వాడుతున్నా.. రాత్రి పూట రగ్గులు కప్పుకోవాల్సిన అవ సరం ఏర్పడిందని నగర ప్రజలు చెబుతున్నారు.  

ఎన్నెన్నో రకాలు..
కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు పలు రకాల దేశీయ, విదేశీ రగ్గులు విక్రయానికి ఉంచారు. సింథటిక్, క్విల్డ్, మింక్‌తో తయారైన దేశీయ రగ్గులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నట్లు వారు చెబుతున్నారు. లుథియానాలో ఉన్నితో తయారు చేసిన రగ్గులు దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. టర్కీ, ఇరాన్, స్పెయిన్, కొరియా దేశాల్లో తయారైన విదేశీ రగ్గులను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు మదీనా సర్కిల్‌లో మహ్మద్‌ క్యాప్‌ మార్ట్‌ నిర్వాహకుడు మహ్మద్‌ ఇల్యాస్‌ బుఖారీ తెలిపారు.   

ఆకర్షణీయమైన డిజైన్లలో..  
దేశీయ రగ్గులు మాత్రమే మూడు నాలుగు రంగుల్లో అందుబాటులో ఉండగా.. విదేశీ రగ్గులు వివిధ రకాల కలర్స్‌తో పలు డిజైన్లలో మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఉన్నితో తయారైన దేశీయ రగ్గులు వెచ్చదనంతో పాటు అంతగా మృదువుగా ఉండవని, అదే విదేశీ రగ్గులు నున్నటి మింక్, సింథటిక్‌తో తయారవుతాయి కాబట్టి మృదువుగా ఉంటాయంటున్నారు. ఇవి అన్ని వయసుల వారూ  కప్పుకోవడానికి అనుకూలంగా ఉంటాయని వారు చెబుతున్నారు.  

విదేశీ రగ్గులకు డిమాండ్‌ 
పెథాయి తుపాను ప్రభావంతో నగరంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో  ప్రజలు రాత్రిపూట కప్పుకోవడానికి రగ్గులు కొనుగోలు చేస్తున్నారు. లూథియానాలో తయారైన దేశీయ రగ్గులకు గతంలో ఎక్కువ డిమాండ్‌ ఉండేది. ప్రస్తుతం విదేశీ రగ్గులకు డిమాండ్‌ ఏర్పడింది. ఇవి వెచ్చదనంతో పాటు మృదువుగా ఉండటంతో వినియోగదారులు ఆసక్తి  కనబరుస్తున్నారు.  –మహ్మద్‌ ఇల్యాస్‌ బుఖారీ, మహ్మద్‌ క్యాప్‌ మార్ట్‌ నిర్వాహకుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top