ముంబై వర్సిటీలో తెలుగు శాఖ

Telugu Department in Mumbai Varsity - Sakshi

      తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు 

     తెలుగువారు ఎక్కువున్న ప్రాంతాల్లోని బడుల్లో మాతృభాష బోధన 

     ఇక్కడి నుంచే పుస్తకాలు, ఉపాధ్యాయులు 

     మహారాష్ట్రలోని తెలుగువారికి తెలుగు మహాసభల కానుక 

     నిర్వాహక కమిటీ యోచన.. కసరత్తు మొదలు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తొలిసారి కానప్పటికీ.. తెలంగాణ వచ్చాక మొదటిసారి జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ ప్రత్యేకతను నిరంతరం గుర్తు చేసేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఇందులోభాగంగా ప్రవాస తెలుగువారుండే ప్రాంతాల్లో గుర్తుండిపోయే పనులు చేపట్టాలని సభ నిర్వాహ కమిటీ నిర్ణయించింది. దాదాపు 10 లక్షలకుపైగా తెలుగువారుండే మహారాష్ట్రలో.. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలల్లో తెలుగు బోధన, ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ముంబై–తెలుగు వర్సిటీలు ఒప్పందం చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో పుస్తకాలు ముద్రించి మహారాష్ట్రలోని తెలుగు బోధించే పాఠశాలలకు పంపడం, అక్కడ తెలుగు ఉపాధ్యాయుల నియామకం సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం ప్రారంభించింది.  

స్థానికుల ఆకాంక్షతో.. 
మహాసభలను విజయవంతం చేసే క్రమంలో దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల్లో నిర్వాహక కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. ఆయా నగరాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగు మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముంబైలో పర్యటించారు. విద్యా బోధన తెలుగులో లేక.. పిల్లల్లో  భాషాభిమానం పెంపొందించేందుకు తెలుగు బోధన అవసరమని రమణాచారి, సిధారెడ్డికి అక్కడి స్థానిక తెలుగు కవులు సంగనేని రవీందర్, అమ్మన్న జనార్దన్, సుదర్శన్‌ వివరించారు. తెలుగు పుస్తకాల పంపిణీ, తెలుగు ఉపాధ్యాయుల నియామకం, ముంబై వర్సిటీలో తెలుగు శాఖ ఏర్పాటు విషయమై చర్చించారు. ఈ విషయాలను వారు మహా రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు వివరించగా సానుకూలంగా స్పందించిన గవర్నర్‌.. అధికారులతో మాట్లాడతానని చెప్పారు.  

ముంబై నుంచి వెయ్యి మంది 
‘మహాసభల కోసం మహారాష్ట్రలోని తెలుగువారు ఉత్సాహంతో ఉన్నారు. ఈసారి 1,000 మంది వరకు అక్కడి నుంచి హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాసభల సమయంలో ప్రత్యేక రైలు నడపాలని గట్టిగా కోరారు’    
– రమణాచారి 

ప్రత్యేకంగా ఓ పూట చర్చ 
‘ఇతర నగరాల్లోని తెలుగువారు భాషా విషయమై ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతర సమస్యలపై చర్చించేందుకు తెలుగు మహా సభల్లో ప్రత్యేకంగా ఓ పూట కేటాయించాలని అనుకుంటున్నాం. ఆయా ప్రాంతాల ప్రముఖులు వెలుబుచ్చే అంశాల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా చర్చ ఉంటుందని ఆశిస్తున్నాం’
– నందిని సిధారెడ్డి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top