రాష్ట్రంలో మరో రెండు హజ్‌ హౌస్‌లు

Telangana Wakf Board Wants Two More Haj House - Sakshi

వక్ఫ్‌ బోర్డు పాలక మండలి సమావేశంలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరో రెండు హజ్‌ హౌస్‌లు నిర్మించాలని వక్ఫ్‌ బోర్డు పాలక మండలి సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్‌ హజ్‌ హౌస్‌ మాదిరిగా సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ల్లో సకల హంగులతో వీటి నిర్మాణం చేపట్టాలని తీర్మానించింది. బుధవారం హైదరాబాద్‌ హజ్‌ హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో జరిగిన బోర్డు పాలక మండలి సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశం అనంతరం బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ సలీం మాట్లాడుతూ.. భువనేశ్వర్‌ వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న రాష్ట్రానికి చెందిన 100 మంది విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించాలని, తుప్రాన్‌లో ఓ ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మసీదు, దర్గాలకు సంబంధించిన 11 కమిటీలకు ఆమోద ముద్రతోపాటు ముగ్గురు ముతవల్లీలను నియమిస్తూ సమావేశం నిర్ణయం తీసుకుందన్నారు. డబుల్‌ బెంచ్‌ తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్‌ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు చేపట్టాలని తీర్మానించినట్లు తెలిపారు.

25 అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వక్ఫ్‌ బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పరిమితి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొంతమంది నాలుగవ తరగతి ఉద్యోగులు 65 ఏళ్లు పైబడి పనిచేయకుండానే భారీ జీతాలు పొందడాన్ని సమావేశం తప్పుబట్టిందని, దీనిపై తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, బోర్డు సీఈవో షాహానవాజ్‌ ఖాసీం, సభ్యులు అక్బర్‌ నిజామొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top