కుర్చీలాట

Telangana Police Department Employees Transfers - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : పోలీసు శాఖలో కుర్చీలాట మొదలైంది. ఎస్‌బీ, వీఆర్, సీబీసీఐడీ, ఇంటలిజెన్స్, ట్రాన్స్‌కో, సీసీఎస్, సైబర్‌ క్రైం, కమ్యూనికేషన్స్‌ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు లా అండ్‌ ఆర్డర్‌లో పోస్టింగ్‌ కోసం ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసినందున త్వరలోనే పెద్ద ఎత్తున బదిలీలు ఉంటాయన్న సమాచారం మేరకు ఆశావహులు తాము కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్‌ కోసం ‘ఖర్చీప్‌’ వేసుకుంటున్నారు. ఈనెల 21వ తేదీ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు ఉంటాయని.. ఎస్‌ఐ, ఎంపీడీఓ, తహసీల్దార్‌ మొదలు ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకు బదిలీలు జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఇందులో మిగతావన్నీ పక్కన పెడితే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టింగ్‌ కోసం పలువురు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

కోడ్‌ ముగిసింది...
ఎన్నికల కోడ్‌ ముగియడమే తరువాయి అన్నట్లుగా పోస్టింగ్‌ల కోసం పలువురు ఇన్‌స్పెక్టర్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 26 పోలీసు సర్కిళ్లు ఉంటే.. 11 సర్కిళ్లలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టింగ్‌ కోసం ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు సంబంధిత ఉన్నతాధికారులకు చేరినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్‌లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లి... మళ్లీ ఈ జిల్లాలో పోస్టింగ్‌ ఆశిస్తున్న పలువురు సీఐలు ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల నుంచి ఇప్పటికే కమిషనరేట్‌కు చేరుకున్నారు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు హాజరవుతున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బందోబస్తులో ఉన్నతాధికారులు, సిబ్బంది నిమగ్నం కాగా.. 21వ తేదీ తర్వాత సీఐల బదిలీల ఉత్తర్వులు వెలువడనున్నాయి.

పోటాపోటీ
పోలీసు పోస్టింగ్‌లన్నీ పొలిటికల్‌ కావడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం లా అండ్‌ ఆర్డర్‌ స్థానాలకు వచ్చేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 26 సర్కిళ్లకు గాను సుమారు 15 సర్కిల్‌ కార్యాలయాల్లో పోస్టింగ్‌ కోసం సీఐలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది రెండు నుంచి మూడేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న సీఐలను కదిలించాలన్న లక్ష్యంతో ఆయా స్థానాలను ఎంచుకుంటున్నారు. కాగా ఇందులో పదింటికైతే పోస్టింగ్‌ కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ఆశావహులు వెనుకాడటం లేదు. మట్టెవాడ, ఇంతెజార్‌గంజ్, హన్మకొండ, కాజీపేట, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, భూపాలపల్లి, వర్ధన్నపేట, హసన్‌పర్తి, ములుగు, తాడ్వాయి, తొర్రూరు, పాలకుర్తి, మహబూ బాబాద్‌ టౌన్‌ తదితర సర్కిళ్లలో పోస్టింగ్‌లు సాధిస్తే చాలు.. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లేనన్న ప్రచారం ఉంది. అందుకే ఈ ఠాణాల్లో పోస్టింగ్‌ కోసం పెద్ద మొత్తంలో పైరవీలు, ఉన్నతా«ధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుండటం చర్చనీయాంశం అవుతోంది.

స్థానాలు ఎంపిక చేసుకున్న పలువురు?
కోరుకున్న చోట కొలువు చేయాలనుకుని భావిస్తున్న కొందరు సీఐలు ఆ ఠాణాల్లో ఖర్చీఫ్‌(లేఖ)లు వేసుకుంటున్నారు. వరంగల్‌ కమిషనరేట్‌తో పాటు జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పలు పోలీసు స్టేషన్లకు మంచి గిరాకీ ఉంది. మట్టెవాడ, ఇంతెజార్‌గంజ్, హన్మకొండ, కాజీపేట, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, భూపాలపల్లి, వర్ధన్నపేట, హసన్‌పర్తి, ములుగు, తాడ్వాయి, తొర్రూరు, పాలకుర్తి, మహబూబాబాద్‌ టౌన్‌ తదితర సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం సీఐల మధ్యన ‘కుర్చీలాట’ సాగుతోంది.

ఎవరెవరు.. ఎక్కడెక్కడికి...
హన్మకొండ సీఐ సంపత్‌రావు ఇక్కడకు వచ్చి మూడేళ్లు పూర్తి కావొస్తుండగా ఆయనకు పదోన్నతి వచ్చే అవకాశముంది. దీంతో ఆయన స్థానం చేజిక్కించుకునేందుకు కనీసం అర డజన్‌ మంది ప్రయత్నం చేస్తున్నారు. కమిషనరేట్‌లోని ఓ స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్, వర్ధన్నపేట డివిజన్‌లోని ఓ సీఐతో పాటు మరో ‘రాజు’ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక మట్టెవాడకు జీవన్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ బదిలీల్లో భాగంగా రాగా, తాజాగా జరగనున్న బదిలీల్లో ఈ స్థానాన్ని ఈస్ట్‌ జోన్‌ నర్సంపేట డివిజన్‌లో కీలక స్టేషన్‌కు చెందిన సీఐ పక్కా చేసుకున్నట్లు తెలిసింది. ఇంతెజార్‌గంజ్‌ స్థానం కోసం ఖమ్మంలో ఉన్న ఓ సీఐ ప్రయత్నం ఫలించినట్లేని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన ఐదు రోజుల క్రితమే ఖమ్మం నుంచి కమిషనరేట్‌కు వచ్చారు. ఖాళీగా ఉన్న కేయూసీ స్థానం కోసం వరంగల్‌ అర్భన్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో పని చేస్తున్న సీఐ పేరు వినిపిస్తోంది.

సుబేదారి సీఐ సదయ్య సుమారు రెండేళ్లుగా పని చేస్తుండగా.. ఇక్కడికి వచ్చేందుకు సీసీఎస్‌లో పని చేస్తున్న ఓ సీఐ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కాజీపేటలో ప్రస్తుతం అజయ్‌కుమార్‌ ఉండగా, గతంలో సుబేదారిలో పని చేసి ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న ఓ సీఐ ఈ స్థానంలోకి వచ్చేందుకు సిఫారసు లేఖ పొందినట్లు తెలిసింది. గతంలో కేయూసీ సీఐగా పని చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మరో సీఐ పేరు కూడా వినిపిస్తుంది. ధర్మసాగర్‌ సీఐగా శ్రీలక్ష్మి రెండేళ్లుగా పని చేస్తుండగా ఈ స్థానానికి వచ్చేందుకు యత్నిస్తున్న వారిలో నర్సంపేట సబ్‌డివిజన్‌లోని ఓ సీఐతో పాటు కేయూసీకి ట్రై చేస్తున్న ఎస్‌బీ సీఐ పేరు కూడా వినిపిస్తోంది. హసన్‌పర్తిలో ప్రస్తుతం తిరుమల్‌ సీఐగా ఉండగా.. ఇక్కడ పోస్టింగ్‌ కోసం వరంగల్‌ ట్రాఫిక్‌లో సీఐగా పని చేస్తున్న ఒకరు ప్రజాప్రతినిధితో గ్రీన్‌సిగ్నల్‌ పొందినట్లు తెలిసింది. పది నెలల కిందట మామునూరు సీఐగా వచ్చిన కిషోర్‌ ఇటీవలే 15 రోజుల సెలవుపై వెళ్లి రాగా, జనగామ డివిజన్‌లోని ఓ సీఐ ఈ పోస్టింగ్‌ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఉమ్మడి జిల్లాలో పలు హాట్‌ స్టేషన్ల కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండటం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. 

ఈ ‘ఠాణా’లు హాట్‌ గురూ
రాష్త్ర వ్యాప్తంగా పోలీసు పోస్టింగ్‌లన్నీ కూడా ఎమ్మెల్యేల అనుమతి, సూచన మేరకు జరుగుతాయన్న ప్రచారం ఉంది. ఉమ్మడి వరంగల్‌లోనే ఇదే పరిస్థితి ఉంది. శాసనసభ ఎన్నికల ముందు ఎలక్షన్‌ కోడ్‌లో భాగంగా మూడేళ్ల సర్వీస్‌ దాటిన అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీపై వివిధ ప్రాంతాలకు వెళ్లారు. అప్పటి నుంచి వారికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో పోస్టింగ్‌ల కోసం టచ్‌లో ఉన్నారు. గత నెల 23తో ఎన్నికల కోడ్‌ ముగియగా, ఈనెల 21 తర్వాత ఉమ్మడి వరంగల్‌లో భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. దీని కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇంటి ముందు కొందరు పోలీసు అధికారులు క్యూ కడుతున్నారు. దీంతో పాటు వారి ప్రధాన అనుచరులు, కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు అభిమానించే వ్యక్తులను సైతం ప్రసన్నం చేసుకుని సిఫారసు లేఖలు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top