‘నగదు రహితం’లో రాష్ట్రమే టాప్‌ | Telangana number one position in Cashless | Sakshi
Sakshi News home page

‘నగదు రహితం’లో రాష్ట్రమే టాప్‌

Jan 26 2017 7:18 AM | Updated on Sep 5 2017 2:06 AM

‘నగదు రహితం’లో రాష్ట్రమే టాప్‌

‘నగదు రహితం’లో రాష్ట్రమే టాప్‌

నగదు రహిత చెల్లింపుల్లో భారత దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు.

జపాన్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్‌
సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషిసన్‌తో మంత్రి భేటీ
టీ–ఇన్నోవేషన్‌ ఫండ్‌లో భాగస్వామి కావాలని విజ్ఞప్తి
‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం
టోక్యో క్లీన్‌ అథారిటీ అధికారులతోనూ కేటీఆర్‌ భేటీ


సాక్షి, హైదరాబాద్‌: నగదు రహిత చెల్లింపుల్లో భారత దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం సాఫ్ట్‌ బ్యాంక్‌ సీఈవో, సీఎండీ మయవోషిసన్‌తో సమావేశమయ్యారు. సాఫ్ట్‌వేర్, డిజిటల్‌ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతి, తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా భారత్‌లో నోట్ల రద్దు తర్వాతి పరిస్థితులపై సాఫ్ట్‌బ్యాంక్‌ సీఈవో ఆరా తీశారు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకుని, అభినందించారు. నూతన ఆవిష్కరణలకు టీ–హబ్‌ లాంటి ప్రాజెక్టులు ఎంతో మేలు చేస్తాయని ప్రశంసించారు. ఇక నవంబర్‌లో చేపట్టనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ సదస్సుకు గౌరవ అతిథిగా హాజరుకావాలని సాఫ్ట్‌ బ్యాంక్‌ సీఈవోను మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీ–ఇన్నోవేషన్‌ ఫండ్‌లో ఆ సంస్థ భాగస్వామి కావాలని కోరారు.

సాంకేతిక సహకారం అందించండి
జపాన్‌ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ రాజధాని టోక్యోలో మంత్రి కేటీఆర్‌ విస్తృతంగా పర్యటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టోక్యో లాంటి విశాల నగరాన్ని నడిపిస్తున్న తీరుపై, ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై అధ్యయనం జరిపారు. టోక్యో క్లీన్‌ అథారిటీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. వాయు కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొనేందుకు అవలంబిస్తున్న వ్యూహాన్ని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు సాంకేతిక సహాయం అందించాలని టోక్యో క్లీన్‌ అథారిటీ అధికారులను కేటీఆర్‌ కోరారు. టోక్యోలో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల పట్ల మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నగరం పట్ల అక్కడి పౌరుల బాధ్యత అద్భుతమని కొనియాడారు. ఏదో ఒక రోజు హైదరాబాద్‌ నగరం టోక్యో స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ చెత్తను రీసైక్లింగ్‌ చేసే ప్లాంట్లతో పాటు టోక్యో మెట్రోపాలిటన్‌ పరిధిలోని రెండు మున్సిపాలిటీల్లో చెత్త రీసైకిల్‌ ప్లాంట్లను మంత్రి పరిశీలించారు.

టోక్యోలోని ఇండియన్‌ స్కూల్‌లో..
టోక్యోలో ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను కేటీఆర్‌ సందర్శించి, అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం కోసం విద్యార్థులు చేస్తున్న రిహార్సల్స్‌ను తిలకిం చారు. టోక్యో లాంటి అంతర్జాతీయ నగరంలో భారతదేశ జాతీయ గీతాన్ని విన్నందుకు భారతీయుడిగా గర్వపడుతున్నానని ఈ సంద ర్భంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement