పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు సమఉజ్జీలే.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు సమఉజ్జీలే. టీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాల పార్టీల నుంచి తలపడుతున్న ముగ్గురు అభ్యర్థులు విద్యారంగం నుంచే వచ్చినవారు కావడ విశేషం. వీరిలో మొదటగా టీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనురాగ్ విద్యాసంస్థల అధిపతికాగా...బీజేపీ నుంచి పోటీలో ఉన్న ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు వరంగల్ జిల్లాలో రూరల్ డెపలప్‌మెంట్ ఫోరం పేరుతో గిరిజన పిల్లల కోసం పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇక మూడో అభ్యర్థి నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు ఆవాసం అనాజిపురం చెందిన సూరం ప్రభాకర్‌రెడ్డి.
ఈయన తెలంగాణ రాష్ట్ర బీఈడీ కళాశాలల యాజమాన్యల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. సీపీఎం, సీపీఐ, న్యూ డెమెక్రసీ కలిపి పది వామపక్ష పార్టీల తరఫున సుధాకర్‌రెడ్డి పేరును బుధవారం ప్రకటించారు. విద్యార్థి దశలో పీడీఎస్‌యూలో కీలక పాత్ర పోషించిన సూరం అభ్యదయవాది. గురువారం సుధాకర్‌రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్ తదితరులు హాజరుకానున్నారు.
పోటా...పోటీ...
ప్రధాన రాజకీయ పక్షాలు ఒకవైపు...విద్యా రంగానికి చెందిన వ్యక్తులే పట్టభద్రుల మండలి స్థానానికి పోటీ చేయడం విశేషం. మూడు జిల్లాలో మేధావులు, విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో వీరిని ప్రభావితం చేయడంలో ఈ ముగ్గురు పాత్ర కీలకంగానే ఉంటుంది. ఇప్పటివరకు టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా సుధాకర్‌రె డ్డి పేరు తెరమీదరకు రావడంతో అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడి ంది. రామ్మోహన్‌రావు అభ్యర్థిత్వం రెండు మాసాల కిందటే ఖరారు కావడంతో చాపకింద నీరులా ఆయన ప్రచారం సాగుతోంది.
ప్రతి 500 ఓట్లకు ఒక ఇన్‌చార్జిని నియమించి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వంపై తర్జనభర్జనల అనంతరం పల్లా పేరు ఖరారు కావడంతో ప్రచారంలో కాస్తా వెనకడుగు అయింది. అధికార పార్టీ కావడంతో ప్రచారం ఆలస్యమైన పట్టభద్రులను ఆకర్షించేందుకు తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. సుధాకర్‌రెడ్డి నేపథ్యం కూడా బలంగా ఉన్నందున ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలకు వామపక్షాల అభ్యర్థి గట్టిపోటీనివ్వనున్నారు. గురువారం నామినేషన్ల ఆఖరు కావడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది.