ఇక 33 జిల్లాలు 

Telangana Government Issued Final Notification For Two New Districts - Sakshi

నేటి నుంచి మనుగడలోకి ములుగు, నారాయణపేట 

తుది నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

ములుగులో 9 మండలాలు, 336 గ్రామాలు 

నారాయణపేటలో 11 మండలాలు, 246 గ్రామాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర భౌగోళిక స్వరూపం 33 జిల్లాలుగా విడిపోయింది. ప్రస్తుతమున్న 31 జిల్లాలకు తోడు ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ములుగు, నారాయణపేట జిల్లాలు నేటి నుంచి మనుగడలోకి రానున్నాయి. ములుగు జిల్లాలో 9 మండలాలు, 336 గ్రామాలుండగా... 11 మండలాలు, 246 గ్రామాలతో నారాయణపేట జిల్లా ఏర్పడింది. ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్‌ 31న ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ కాగా, నెల రోజుల పాటు అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. 

ఈ అభ్యంతరాలు, వినతులను పరిశీలించిన అనంతరం తెలంగాణ జిల్లాల (ఏర్పాటు) చట్టం 1974, సెక్షన్‌ 3 ప్రకారం ఆదివారం నుంచి ఈ జిల్లాలు మనుగడలోకి వస్తాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు... నారాయణపేట జిల్లాలో నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూర్, ఉట్కూరు, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలు ఉన్నాయి.  

కొత్త కలెక్టర్ల నియామకం.. 
రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం శనివారమే ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వెంకటేశ్వర్లుకు ములుగు జిల్లా, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌రాస్‌కు నారాయణపేట జిల్లా కలెక్టర్లుగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి ఉత్తర్వులు జారీ చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top