నాడు ఇంద్రారెడ్డి.. నేడు మల్లారెడ్డి

Telangana Cabinet 2019 - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాకు మరోసారి కార్మికశాఖ లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా జరిగిన కేబినెట్‌ విస్తరణలో బెర్త్‌ దక్కించుకున్న చామకూర మల్లారెడ్డిని అదే శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వరించింది. మేడ్చల్‌ శాసనసభ్యుడిగా తొలిసారి విజయం సాధించిన మల్లారెడ్డి మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రమాణస్వీకారం చేశారు. 2014లో మల్కాజిగిరి ఎంపీగా టీడీపీ తరఫున గెలుపొందిన మల్లారెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్‌ ఎమ్మెల్యేగా బరిలో దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్‌.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో చామకూరకు అవకాశం కల్పిం చారు. మృదుస్వభావి, హాస్యచతురుడైన మల్లారెడ్డికి ఆమాత్య హోదా కట్టబెట్టడం సమంజసమని కేసీఆర్‌ భావించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. గ్రేటర్‌ పరిధిలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని చామకూరకు చాన్స్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. 

నాడు ఇంద్రారెడ్డి.. నేడు మల్లారెడ్డి 
తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్న మల్లారెడ్డికి కార్మికశాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖను కేటాయిస్తూ మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు  జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖను మన జిల్లా నుంచి ఇంద్రారెడ్డి నిర్వర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు మల్లారెడ్డికి ఈ పోర్టుపొలియో లభించింది. గత ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో అదే శాఖను మల్లారెడ్డికి కట్టబెడుతారనే ప్రచారం జరిగింది. అదేసమయంలో ఆయన వ్యవహారశైలిని అంచనా వేసిన విశ్లేషకులు.. ఆయనకు క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖలు దక్కుతాయని అంచనా వేశారు.

అయితే, పరిశీలకుల ఊహలకందని విధంగా కార్మిక శాఖను సీఎం అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మంత్రి కావాలనే చిరకాల వాంఛ నెరవేరడంతో మల్లారెడ్డి ఆనందంలో మునిగిపోయారు. అమాత్య పదవిపై కన్నేసిన ఆయన ఎంపీ పదవిని కాదని ఎమ్మెల్యేగా పోటీచేయడం.. విజయం సాధించడం.. మంత్రి పదవిని దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇదిలావుండగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్, పరిసర కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు భారీగా ఉండడం.. కార్మికులు కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ పనిచేస్తుండడం ఆయన పనితీరును ప్రభావితం చేయనుంది.  

శుభాకాంక్షలు

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చామకూర మల్లారెడ్డికి జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులతో కలిసి బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసానికి వెళ్లారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం మల్లారెడ్డికి పూల మొక్కను బహూకరించారు. ఆమెతో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సంజీవ్‌రెడ్డి, శైలజ, రమాదేవి తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top