నేటి నుంచే అసెంబ్లీ

 Telangana Assembly Sessions Start From Today - Sakshi

నేడు ఎమ్మెల్యేల ప్రమాణం..

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రారంభం

ప్రమాణం చేయించనున్న ముంతాజ్‌ ఖాన్‌

అనంతరం స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

రేపు స్పీకర్‌ ఎన్నిక.. వెంటనే బీఏసీ భేటీ

19న ఉమ్మడి సభల సంయుక్త భేటీ

అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రెండో శాసనసభ నేడు కొలువుదీరనుంది. గురువారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ తొలి సమావేశం మొదలవుతుంది. తాత్కాలిక స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశం కాగానే.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎం కేసీఆర్‌తో ఈ కార్యక్రమం మొదలవుతుంది. సీఎం తర్వాత ప్రతిపక్ష నేత, మహిళా సభ్యులు ప్రమాణం చేస్తారు. అనంతరం మిగిలిన సభ్యుల ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. దాదాపు రెండుగంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అనంతరం జూబ్లీహాల్‌ ప్రాంగణం కౌన్సిల్‌ లాన్స్‌లో కొత్త ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక నిర్వహణ ప్రక్రియ మొదలవుతుంది.

అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు స్పీకర్‌ ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. వెంటనే స్పీకర్‌ పదవికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుంది. శుక్రవారం స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ను సీఎం, ప్రతిపక్ష నేత, ఇతర రాజకీయ పక్షాల నాయకులు.. స్పీకర్‌ సీటు వద్దకు తీసుకెళ్తారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభ సమావేశాలు కొనసాగుతాయి. అనంతరం స్పీకర్‌ అధ్యక్షతన.. శాసనసభ నిర్వహణపై బీఏసీ భేటీ జరుగుతుంది. శనివారం ఉభయసభల (శాసనసభ, శాసనమండలి) సంయుక్త సమావేశం జరుగుతుంది. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. గవర్నర్‌ ప్రసంగానికి «శాసనసభ, శాసనమండలి ధన్యవాదాలు తెలుపుతాయి. దీంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి.

పెరిగిన బలంతో టీఆర్‌ఎస్‌...
ముందస్తు ఎన్నికలతో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టింది. గత ఎన్నికలతో పోల్చితే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎంఐఎం పాత స్థానాలను తిరిగి నిలబెట్టుకోగా.. మిగిలిన అన్ని రాజకీయ పక్షాల సీట్లు తగ్గిపోయాయి. వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు.  

సభ్యులకు రాజ్యాంగ ప్రతులు
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రమాణం సందర్భంగా ఓ చేతిసంచిని ఇవ్వనున్నారు. ఇందులో భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగ పరిచయం, శాసనసభ నిబంధనావళి (తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ), అబ్‌స్ట్రాక్ట్‌ సిరీస్, హ్యాండ్‌బుక్‌ ఫర్‌ మెంబర్స్, లైబ్రరీ ఎట్‌–ఎ–గ్లాన్స్, సభ్యులకు ఉండే వసతులు–సౌకర్యాలు, అసెంబ్లీ ప్రశ్నల నియమావళి (గైడ్‌లైన్స్‌ ఆన్‌ ఎల్‌సీక్యూస్, ఎల్‌ఏక్యూస్‌), సీపీఏ ఇన్ఫర్మేషన్‌ బుక్‌లెట్, బయోడేటా ఫామ్, శాలరీ ఫామ్‌ (3), టీఏ ఫామ్స్, క్వశ్చన్‌ ఫామ్‌ (10), లెటర్‌ హెడ్స్‌ (మూడు రకాలు), ఫామ్‌ –3 (ఫిరాయింపుల నియమావళి), స్కిబ్ల్రింగ్‌ ప్యాడ్, యునీ బాల్‌పెన్స్‌ (బ్లూ అండ్‌ గ్రీన్‌) ఉంటాయి.

మంత్రివర్గంపై ఆసక్తికర చర్చ
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎంతో పాటు మహమూద్‌ అలీ మాత్రమే కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగింది. సీఎం, మహమూద్‌ అలీలతోపాటు మరో 6–8 మందికి అవకాశం ఉంటుందని, ఈనెల 18న విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతోంది. అయితే, దీనిపై కేసీఆర్‌ మనసులో ఏముందనేది.. టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో ఆశావాహులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు 4రోజుల్లోనే పూర్తవుతుండడంతో.. కేసీఆర్‌ ఆలోచన ప్రకారం ఈసారికి విస్తరణ లేనట్టేననే చర్చ కూడా జరుగుతోంది.

అమరవీరులకు నివాళులర్పించి..
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఉదయం 11 గంటలకు గన్‌పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.05 గంటలకు సీఎం కేసీఆర్‌ శాసనసభకు చేరుకుంటారు. అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ముఖ్యమంత్రే సీనియర్‌!
– 8సార్లు అసెంబ్లీకి ఎన్నికయిన నేతగా రికార్డు
– ఈసారి అసెంబ్లీకి 23 మంది కొత్త ముఖాలు

సీఎం కేసీఆర్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 1983లో రాజకీయ అరంగేట్రం నుంచి నేటి వరకు మొత్తం ఎనిమిదిసార్లు (ఉప ఎన్నికలు కలుపుకుని) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీకి ఎన్నికైన వారిలో ముఖ్యమంత్రే సీనియర్‌. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన 1983 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వరుసగా అప్పటినుంచి 8సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో ఎంపీగా గెలిచారు. 1985 నుంచి ఇప్పటివరకు పోటీచేసిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందుతూ వస్తున్నారు. ఎనిమిదిసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్‌ వివిధ పదవులను నిర్వర్తించారు. ఉపసభాపతిగా, మంత్రిగా, పీఏసీ చైర్మన్‌గా, అనేక కమిటీల్లో సభ్యునిగా, తెలంగాణ రాష్ట్ర మొదటి సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్‌ తర్వాత ఆరుసార్లు గెలిచిన నేతలుగా ముగ్గురు ఎమ్మెల్యేలు స్థానం సంపాదించారు. ప్రస్తుత ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్, సీనియర్‌ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఆరు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు.

ఇతర సభల నుంచి అసెంబ్లీకి..
ఎంపీలుగా ఉన్న సీహెచ్‌ మల్లారెడ్డి, బాల్కసుమన్, ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే, వీరిలో మైనంపల్లి గతంలో ఎమ్మెల్యేగా పనిచేయగా, మిగిలిన నలుగురూ శాసనసభకు కొత్తవారే కావడం గమనార్హం. 2014–18 మధ్య ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో 76 మంది మళ్లీ గెలవగా, 2009–2014 మధ్య ఎమ్మెల్యేలుగా గెలిచి 2014 ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో 16 మంది తిరిగి అసెంబ్లీకి వస్తున్నారు. మొత్తంగా 23 కొత్తముఖాలు ఈసారి తొలిసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నాయి.

వయసులో వనమా..
ఎమ్మెల్యేల వయసును పరిశీలిస్తే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (73) వయసురీత్యా అందరికంటే పెద్దవారు. అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం (72), ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ (70)లు ఆయన తర్వాత పెద్దవారు. అయితే, ఈసారి అసెంబ్లీలో ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్‌ (29) అత్యంత పిన్నవయస్కురాలిగా గుర్తింపు పొందనున్నారు. ఆమె తర్వాత పైలట్‌ రోహిత్‌రెడ్డి (34), బాల్కసుమన్‌ (35), గ్యాదరి కిశోర్‌ (37)లు ఉన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి ఏడుగురు కలిపి మొత్తం 8 మంది మైనార్టీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల నుంచి ముగ్గురేసి మహిళా ఎమ్మెల్యేలు సభలో ఉండడం గమనార్హం.

అసెంబ్లీలో వివిధ పార్టీల బలాబలాలివి:
పార్టీ            2018    2014
టీఆర్‌ఎస్‌       88    63
కాంగ్రెస్‌          19    21
ఎంఐఎం         07    07
టీడీపీ            02    15
బీజేపీ            01    05
ఏఐఎఫ్‌బీ        01    00
ఇండిపెండెంట్‌   01    01
వైఎస్సాఆర్‌సీపీ ––    03        
బీఎస్పీ            ––    02    
సీపీఎం           ––    01

సీపీఐ             ––    01 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top