ఎన్నికల రథసారథులు..

Telangan Loksabha Elections In Khammam - Sakshi

ఎన్నికల విధుల్లో కీలకపాత్ర  

జిల్లా అధికారిగా కలెక్టర్‌    

నియోజకవర్గానికో రిటర్నింగ్‌ అధికారి  

నామినేషన్లపై వీరిదే ఆజమాయిషీ

సాక్షి, ఖమ్మంసహకారనగర్‌: జిల్లాలో ఎన్నికల వేడి జోరందుకుంది..ఇప్పటికే భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..దీనికి తోడు ఎన్నికల ప్రచారాలు, సన్నాహాలు, నాయకుల విమర్శలు వాతావరణాన్ని మరింత వేడిసెగలు కక్కేలా చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసి అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగిస్తుండగానే.. వచ్చే నెలలో పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ క్రమంలో ఎన్నికల విధులు నిర్వహించే రథసారధులు వారి బాధ్యతలు సమర్థంగా పూర్తి చేస్తేనే చివరి ఓటరు వరకు ఓటుహక్కును వినియోగించుకోవడం జరుగుతుంది.

ఎన్నికల తంతును విజయవంతంగా ముగించడంలో బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారుల కృషి విశేషంగా ఉంటుంది. ఏ ఒక్కరూ వారి విధులను సక్రమంగా నిర్వర్తించకున్నా పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు వెల్లడించే వరకు ప్రతీ సందర్భాన్ని అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎన్నికల నిర్వహణలో అధికారుల విధులు ఏవిధంగా ఉంటాయో పరిశీలిద్దాం. 

ప్రధాన ఎన్నికల అధికారి
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకునే అధికారం ప్రధాన ఎన్నికల అధికారికి ఉంటుంది.

జిల్లా ఎన్నికల అధికారి
ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణకు లోబడి ప్రతీ జిల్లాకు ఒక ఎన్నికల అధికారి ఉంటారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ ఈ బాధ్యతను నిర్వహిస్తూ జిల్లావ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికలు నిర్వహించడంలో కీలక భూమిక పోషిస్తారు. 

రిటర్నింగ్‌ అధికారి
శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్‌ అధికారిని నియమిస్తుంది. నామినేషన్‌ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపుతో పాటు తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది నియామకం, శిక్షణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వంటి అన్ని రకాల పనులు ఆర్‌ఓ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. ఆయా నియోజవర్గాల పరిధిలోని రెవెన్యూ డివిజినల్‌ అధికారి లేదా జేసీ రిటర్నింగ్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. 

సెక్టోరల్‌ ఆఫీసర్‌
ఎనిమిది నుంచి పది కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఒక సెక్టోరల్‌ అధికారిని నియమిస్తారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు, అవసరమైనచోట 144 సెక్షన్‌ విధించే అధికారం సెక్టోరల్‌ అధికారికి ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్‌ బూత్‌లు గుర్తించి అక్కడ బందోబస్తు ఏర్పాటుకు సిఫార్సు చేయడం వంటి విధులు నిర్వహిస్తారు. 

ప్రిసైడింగ్‌ అధికారి
ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారి ఉంటాడు. ఆయన పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావడం, పోలింగ్‌ అనంతరం సీల్‌ వేసి స్ట్రాంగ్‌రూమ్‌కు వచ్చే వరకు ప్రిసైడింగ్‌ అధికారి పూర్తి బాధ్యత వహిస్తారు. ఇతడికి సహాయకుడిగా మరో అధికారి ఉంటారు. పోలింగ్‌ కేంద్రంలో జరిగే అన్ని కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలోనే నడుస్తాయి.

ఫ్లయింగ్‌స్క్వాడ్‌ 
మూడునాలుగు మండలాలకు ఒక ఫ్లయింగ్‌స్క్వాడ్‌ బృందం ఉంటుంది. ఈ బృందం తమకు కేటాయించిన మండలాల పరిధిలో మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించడం వీరి బాధ్యత. 

ఓటరు నమోదు అధికారి
ఓటర్ల జాబితా తయారు చేయడం ఈ అధికారి ప్రధాన బాధ్యత. ఓటును నమోదు చేసుకునే వారు జాబితాల్లో పేర్లు తప్పుగా ఉన్నవారు ఈ అధికారిని సంప్రదించవచ్చు. ఈయన పర్యవేక్షణలో మరికొందరు అధికారులు ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. 

పోలింగ్‌ ఏజెంట్లు..
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రతీ పోలింగ్‌ కేంద్రాన్ని నేరుగా పరిశీలించే అవకాశం ఉండనందున ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో తన పక్షాన ఒక ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. ఈయనే పోలింగ్‌ ఏజెంట్‌. ఇతను ఓటు వేసేందుకు వచ్చిన వారి వివరాలను ఓటర్ల జాబితాలో సరి చేసుకుని అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెబుతారు. దీంతో దొంగ ఓట్లు పడకుండా చూడవచ్చు. పోలింగ్‌ ఏజెంట్‌ సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. 

మైక్రో అబ్జర్వర్లు
ఎన్నికల నిర్వహణ జరిగిన తీరుపై నివేదిక రూపొందించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపించడంలో  మైక్రో అబ్జర్వర్లు కీలకంగా వ్యవహరిస్తారు.

 
బూత్‌లెవల్‌ అధికారులు
కొత్తగా ఓటు నమోదు చేసకునే వారికి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయడం. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడం. ఓటరు జాబితాల ప్రదర్శన, పోలింగ్‌ కేంద్రాల మార్పు తదితర అంశాల్లో బూత్‌లెవల్‌ అధికారులు సేవలందిస్తారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top