హస్తం.. సమాయత్తం

T In Congress  Leaders Election  Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు దీటుగా నిలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. అయితే పార్టీలో సంస్థాగతంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించి.. అందరినీ సమన్వయం చేయడంతోపాటు కలుపుకుని పోయే నేత కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఆది నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభంజనం వీచినా..  ఎదురొడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తన సత్తా చాటిన సంఘటనలు అనేకం ఉన్నాయి. 2014లో రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌ గాలి వీచినా.. ఉమ్మడి జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ నాలుగు శాసనసభ స్థానాలను గెలుపొంది.. మెజార్టీ శాసనసభ స్థానాలను గెలుచుకున్న పార్టీగా జిల్లాలో గుర్తింపు పొందింది.

కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్తేజం కలిగించేందుకు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు దీటుగా వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించేందుకు జిల్లా పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నా.. వర్గ పోరు వల్ల ఒకరు అవునంటే.. మరొకరు కాదనే పరిస్థితి ఉండటం.. దీనికి అధిష్టానం ఆమోదముద్ర అవసరం ఉండటం వంటి కారణాలతో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు దూకుడు పెంచలేకపోతున్నారనే భావన కార్యకర్తల్లో నెలకొంది. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అయితం సత్యం మరణంతో ఖాళీ అయిన కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నియామకం దాదాపు ఆరు నెలలు గడిచినా.. ఇప్పటికీ కొలిక్కి రాలేదు. దీనికి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వర్గ పోరే కారణమన్నది బహిరంగ రహస్యమే. దీనిపై అధిష్టానం సత్వర నిర్ణయం తీసుకుంటుందని, పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంతోపాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను వేగిరం చేసేందుకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటుందని భావించిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల ఆశలు ఇప్పటికీ ఫలించలేదు.
 
మనోధైర్యం కల్పించే ప్రయత్నం.. 
రెండు నెలల క్రితం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో వారిని కార్యోన్ముఖులను చేయడం కోసం కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలతో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే సలీం అహ్మద్‌.. జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించి కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. ఆయనకు జిల్లా పరిస్థితి గురించి కార్యకర్తలు నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నేతలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని, ఇతర ప్రాంతాల నుంచి నేతలను దిగుమతి చేసే విధానానికి ఈ ఎన్నికల్లోన్నైనా స్వస్తి చెప్పాలని పలువురు నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఏఐసీసీ కార్యదర్శికి విన్నవించారు. అలాగే డీసీసీ అధ్యక్ష పదవిని జిల్లాలోని అన్ని వర్గాలను సమన్వయం చేసి.. పార్టీ పట్ల అంకితభావం, పట్టున్న నేతకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

జలగంను చేర్చుకోవాలనే డిమాండ్‌.. 
ఇక సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు మరికొన్ని నియోజకవర్గాల కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు మాజీ మంత్రి జలగం ప్రసాదరావును తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గుండెకాయలా ఉన్న ఖమ్మం నగర కాంగ్రెస్‌కు ఇప్పటివరకు కమిటీ వేయకపోవడంపై ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు అధిష్టానం సత్వరమే పరిష్కారం చూపుతుందని, పార్టీ కార్యకర్తలు మరింత అంకితభావంతో పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు కార్యకర్తలకు మనోధైర్యం కల్పించినా.. కీలక సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంతోపాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలనే లక్ష్యంతో పాదయాత్ర చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు. అయితే అధిష్టానం అనుమతి కోసం ఆయన సన్నిహితులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు నిరీక్షిస్తున్నారు.
 
  సంస్థాగతంగా అనేక సమస్యలున్నా.. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థి పార్టీలతో సమానంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ.. కేడర్‌ చేజారకుండా తమవంతు ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కార్యకర్తలను సమన్వయం చేసి.. గెలుపు కోసం దిశానిర్దేశం చేసే జిల్లా కాంగ్రెస్‌ రథసారథిపై ఇంకా స్పష్టత రాకపోవడంపై కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఇక సుదీర్ఘకాలంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక పదవులు చేపట్టిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డికి మరోసారి ఏఐసీసీ స్థాయిలో కీలక పదవి లభిస్తుందని ఆయన వర్గీయులు కొండంత ఆశతో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తారా..? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? అనే అంశం పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో మంచి పట్టున్నప్పటికీ పార్టీకి దిశానిర్దేశం చేసి.. కార్యకర్తలకు కష్టకాలంలో మనోనిబ్బరం కల్పించే నేతల కొరత జిల్లాస్థాయిలో ఉండటం వంటి సమస్యలు పార్టీ కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. డీసీసీ అధ్యక్షుడి వ్యవహారం ఢిల్లీకి చేరినా.. ఇంకా దానిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోకపోవడం, జలగం ప్రసాదరావును పార్టీలోకి చేర్చుకోకపోవడంపై పార్టీ సంప్రదింపుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసినా.. దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించకపోవడం వంటి సంస్థాగత సమస్యలపై అధిష్టానం దృష్టి పెడితే కార్యకర్తల్లో మరింత మనోధైర్యం కలగడంతోపాటు కార్యకలాపాలను వేగవంతం చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top