వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది 

System is greater than the person - Sakshi

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణన్‌ 

జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డికి ఘనంగా వీడ్కోలు 

హైదరాబాద్‌: వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పదని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల జ్యుడీషియల్‌ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయాధికారులు వ్యవస్థ గొప్పతనాన్ని ఇనుమడింపజేయాలని సూచించారు. ప్రతి పనికి నిర్ధిష్టమైన విధానం ఉండటం అవసరమని అన్నారు. వివిధ రకాల కేసులకు సంబంధించిన విచారణకు ప్రత్యేక విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి జ్యుడీషియల్‌ అకాడమీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.

ముఖ్యంగా ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాక్‌ కోర్టు.. శిక్షణలో ఉన్న న్యాయాధికారులు, జడ్జీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలో న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి జ్యుడీషియల్‌ అకాడమీలో గౌరవ సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ వి.రాఘవేంద్ర ఎస్‌ చౌహాన్, జ్యుడీషియల్‌ అకాడమీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సభ్యులు పీవీ సంజయ్‌కుమార్, సి.సుమలత, ట్రెయినీ న్యాయాధికారులు, జ్యుడీషియల్‌ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు జ్యుడీషియల్‌ అకాడమీలో కంప్యూటర్‌ ల్యాబ్, చెక్‌ బౌన్స్‌ కేసులకు సంబంధించి జ్యుడీషియల్‌ అకాడమీ రూపొందించిన స్టాండర్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను చీఫ్‌ జస్టిస్‌ ప్రారంభించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top