గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక ఎమర్జెన్సీ బ్లాక్‌

Superspeciality Emergency Block in Gandhi Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక వసతులతో కూడిన ఎమర్జెన్సీ బ్లాక్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా 60 ఐసీయూ పడకలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం రూ.8 కోట్ల వ్యయంతో ఈ బ్లాక్‌ను తీర్చిదిద్దుతున్నారు. గతంలో సాధారణ పద్ధతిలో మాత్రమే ఎమర్జెన్సీ బ్లాక్‌ ఉండగా, ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చివేసి ప్రత్యేక బ్లాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది. 

అత్యవసర కేసులన్నీ ఇక్కడకే..
ఎటువంటి అత్యవసర కేసు అయినా ముందుగా ఈ ఎమర్జెన్సీ బ్లాక్‌కు వస్తుంది. ఇక్కడ రోగిని ప్రాథమికంగా పరీక్షించాక అవసరాన్ని బట్టి ఇందులోనే ఉంచాలా? లేక సంబంధిత స్పెషలిస్టు వార్డులకు పంపాలా అనేది నిర్ణయిస్తారు. ఈ ఎమర్జెన్సీ బ్లాక్‌లో ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, గుండెపోటులకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని డీఎంఈ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వైద్య పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. అలాగే నిపుణులైన వైద్యులను నియమించనున్నారు. అవసరాన్ని బట్టి అందులో పనిచేసే వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సుశిక్షితులైన వైద్య సిబ్బందిని తీసుకొచ్చే అవకాశముంది. ఎమర్జెన్సీ మెడిసిన్‌ ప్రొటోకాల్‌ కాబట్టి ఆ మేరకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఏటా సగటున 90 వేల మెడికల్‌ ఎమర్జెన్సీ కేసులు నమోదవుతున్నాయి.

ఇందులో అత్యధికంగా 70 శాతం రోడ్డు ప్రమాద బాధితులవి కాగా, రెండో స్థానంలో గుండెపోటు కేసులున్నాయి. ఇందులోనూ ఎక్కువ శాతం అత్యవసర కేసులు గాంధీ ఆస్పత్రికే వస్తున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులు చేర్చుకోని అనేక కేసులు సైతం ఇక్కడికే వస్తుంటాయి. ఇక నిమ్స్‌ ఆస్పత్రిలో పడకలు లేకపోతే గాంధీ ఆస్పత్రికే వెళ్లమని అక్కడి వైద్యులు సూచిస్తుంటారు. గాంధీలో పడకలు ఉన్నా.. లేకున్నా రోగులను వెనక్కి పంపించరు. ఎలాగోలా సర్దుబాటు చేస్తారు. మరోవైపు గుండెపోటు బాధితుల చికిత్స కోసం ఇక్కడే స్టెమీ హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

రాష్ట్రంలో మరెక్కడా లేదు
ఎమర్జెన్సీ మెడిసిన్‌ ప్రొటోకాల్‌ పద్ధతిలో అత్యాధునిక వసతులతో దీన్ని నెలకొల్పుతున్నాం. ఇంత పెద్ద ఎమర్జెన్సీ బ్లాక్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా లేదు. నిమ్స్‌లోనూ ఇంత పెద్దది లేదు. ఎంత పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రి అయినా ఎమర్జెన్సీ బ్లాక్‌ కేవలం 20–30 పడకలకు మించి ఉండదు. వచ్చే నెలలో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) 
డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top